కాబూల్: ఆప్ఘానిస్థాన్‌పై పాకిస్థాన్ మరోసారి విరుచుకుపడింది. ఆప్ఘాన్‌లోని కునార్, పక్తికా ప్రావిన్సులలోని పలు ప్రాంతాలపై పాక్ ఎయిర్ ఫోర్స్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో కనీసం ముగ్గురు మరణించగా, పలువురు గాయపడ్డారు. సోమవారం (సెప్టెంబర్ 21) తెల్లవారుజూమున పాక్ ఎయిర్ ఫోర్స్ ఈ మెరుపు దాడులు చేపట్టింది. పక్తికా ప్రావిన్సులోని రాఖా, టోర్కండి రెండు ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఈ రెండు దాడుల్లో పలు నిర్మాణాలు దెబ్బతిన్నప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కునార్‌లో జరిగిన ఎయిర్ స్ట్రైక్ లో మాత్రం ముగ్గురు మరణించారు.
సరిహద్దు ఉగ్రవాదం ఆరోపణల నేపథ్యంలో ఆప్ఘాన్‌లోని తాలిబన్లు, పాక్ ప్రభుత్వానికి మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఆప్ఘానిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ తమ దేశంలో దాడులకు ప్రోత్సహిస్తోందని పాక్ ఆరోపిస్తోంది. ఇందులో భాగంగానే ఆఫ్ఘాన్‌పై పాక్ తాజాగా ఎయిర్ స్ట్రైక్స్ చేపట్టింది. పదేపదే జరుగుతున్న ఈ దాడులు వల్ల ఇరు దేశాల సరిహద్దు వెంబడి ఉన్న ప్రావిన్సులలో పౌరులు ఆందోళనకు గురవుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎదురవుతున్న భద్రతాపరమైన ముప్పుల కారణంగానే తమ సైనిక చర్యలు జరుగుతున్నాయని పాకిస్తాన్ వాదిస్తోంది. పాక్ వాదనను తాలిబన్లు తీవ్రంగా వ్యతిరేకించారు.
ALSO READ : ఆధార్ కార్డ్‌తో పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చా ?
దెబ్బకు దెబ్బ తీస్తం: ఆప్ఘాన్
పాక్ వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని.. దెబ్బకు దెబ్బ తీస్తామని ఆప్ఘాన్ పేర్కొంది. తమ భూభాగాన్ని రక్షించుకునే హక్కు ఆప్ఘాన్‌కు ఉందని తెలిపింది. ఆఫ్ఘన్ గడ్డపై నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పాకిస్తాన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఆఫ్ఘనిస్తాన్ లోపల పాకిస్తాన్ చేపట్టే ఏ సైనిక చర్య అయినా ఆఫ్ఘన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే అవుతుందని, దానికి కాబూల్ నుండి బలమైన ప్రతిస్పందన ఎదురవుతుందని హెచ్చరించింది. భవిష్యత్‌లో ఆఫ్ఘనిస్తాన్‌లో సైనిక చర్యలు చేపట్టవద్దని వార్నింగ్ ఇచ్చింది.
