హైదరాబాద్‌లో నీళ్లు వృథా చేస్తే భారీ జరిమానాలు.. రెండోసారి పట్టుబడితే నల్లా కనెక్షన్ కట్!

హైదరాబాద్‌లో నీళ్లు వృథా చేస్తే భారీ జరిమానాలు.. రెండోసారి పట్టుబడితే నల్లా కనెక్షన్ కట్!

హైదరాబాద్‌లో తాగునీటి వృథాపై జలమండలి అధికారులు సీరియస్ అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా తాగునీటిని వృథా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా జూబ్లీహిల్స్‌లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురు వినియోగదారులకు జరిమానాలు విధించారు.

 తాగునీటితో కార్లు, ఫ్లోర్లు కడగడం, నల్లాలు తెరిచి వదిలేయడం, ఓవర్‌హెడ్ ట్యాంకులు పొంగిపోనివ్వడం వంటి వాటిపై జలమండలి ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇలాంటి వారికి తప్పును బట్టి రూ.1,000 నుంచి రూ.20 వేల వరకు జరిమానాలు విధిస్తున్నారు. ఇకపై నగరవ్యాప్తంగా నీటి సరఫరా వేళల్లో ఈ తనిఖీలు మరింత ముమ్మరం చేయనున్నట్లు స్పష్టం చేశారు.

నీటి వృథాపై అధికారులు కఠిన చర్యలు ప్రకటిస్తూ.. మొదటిసారి పట్టుబడితే జరిమానా విధిస్తామని, ఒకవేళ రెండోసారి కూడా అదే తప్పుకు పాల్పడితే ఏకంగా నీటి కనెక్షనే తొలగిస్తామని హెచ్చరించారు.

ALSO READ : పెద్దమ్మ ఆలయంలో చోరీ.. హుండీ ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

 కేవలం ప్రజల వైపే కాకుండా, జలమండలి వ్యవస్థలోనూ నీటి వృథా జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలో 15 వేల కిలోమీటర్లకు పైగా ఉన్న పైప్‌లైన్ నెట్‌వర్క్‌పై నిఘా పెట్టారు. ఎక్కడైనా పైప్‌లైన్ లీకేజీ గుర్తిస్తే గరిష్ఠంగా 24 గంటల్లోగా మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. తరచూ లీకేజీలు జరిగే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారాలు కనుగొనడంతో పాటు, సమాచారం తెలిసినా సకాలంలో స్పందించని సిబ్బందిని కూడా బాధ్యులను చేస్తామని హెచ్చరించారు.