ఆపిల్‌ ఫిట్‌నెస్ ప్లస్‌లో లేఆఫ్స్: హెల్త్ యాప్‌లో ఫిట్‌నెస్ ప్లస్ విలీనం కానుందా?

 ఆపిల్‌ ఫిట్‌నెస్ ప్లస్‌లో లేఆఫ్స్: హెల్త్ యాప్‌లో ఫిట్‌నెస్ ప్లస్ విలీనం కానుందా?

టెక్ దిగ్గజం ఆపిల్ తన సబ్‌స్క్రిప్షన్ వర్కౌట్ ప్లాట్‌ఫారమ్ 'ఫిట్‌నెస్ ప్లస్'లో ఉద్యోగుల లేఆఫ్స్ స్టార్ట్ చేసింది. ఈ సేవలో భవిష్యత్తులో జరగబోయే మరిన్ని కీలక మార్పులకు ఇది తొలి మెట్టుగా భావిస్తున్నారు. ఆపిల్ గతంలోనే ఈ ప్లాట్‌ఫారమ్ భవిష్యత్తుపై పునఃసమీక్ష జరుపుతున్నట్లు నివేదించిన విషయం తెలిసిందే.

ఎవరిపై ప్రభావం పడింది?
గత వారం జరిగిన లేఆఫ్స్ ప్రధానంగా ఫిట్‌నెస్ ప్లస్ ఆడియో విభాగంలో పనిచేస్తున్న కొద్దిమంది ఉద్యోగులపై ప్రభావం చూపాయి. సబ్‌స్క్రైబర్‌లు వీడియో చూడకుండా కేవలం ఆపిల్ వాచ్ ద్వారా వినే 'టైమ్ టు వాక్', 'టైమ్ టు రన్' వంటి సెషన్ల వెనుక ఉన్న ఉద్యోగులు లేఆఫ్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు. ప్రస్తుతానికి ఈ ఆడియో ఫార్మాట్‌లను పూర్తిగా నిలిపివేయకపోయినా.. ఇకపై కొత్త ఎపిసోడ్‌ల విడుదల మాత్రం తగ్గే అవకాశం ఉందని సమాచారం.

ఖర్చుల భారమే కారణమా?
ఫిట్‌నెస్ ప్లస్‌ నిర్వహణకు అవుతున్న భారీ ఖర్చులు, నిరంతరం కొత్త కంటెంట్‌ను అందించాల్సిన అవసరం, అలాగే సబ్‌స్క్రైబర్లు మధ్యలోనే తప్పుకోవడం వంటి ఒత్తిళ్ల కారణంగానే లేఆఫ్స్ జరిగాయి. పెలోటన్ కంటెంట్ లైబ్రరీకి పోటీగా ఆపిల్ తీసుకువచ్చిన ఈ ప్లాట్‌ఫారమ్, వ్యూహాత్మకంగా ఖర్చులు తగ్గించుకోవడానికి సులభమైన లక్ష్యంగా మారిందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఈ సేవను ఆపిల్ సర్వీసెస్ చీఫ్ ఎడ్డీ క్యూ, హెల్త్ లీడర్ సుంబుల్ దేశాయ్ సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నారు.

►ALSO READ | ఆధార్ కార్డ్‌తో పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చా ? రూపాయి ఖర్చు లేకుండా ఎలా పొందొచ్చు అంటే..

భవిష్యత్తులో ఎలాంటి మార్పులు ఉండవచ్చు?
రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఖర్చులు తగ్గించుకోవడానికి, నిర్మాణపరమైన మార్పులు చేయడానికి ఈ లేఆఫ్స్ కేవలం ఆరంభం మాత్రమేనని ఫిట్‌నెస్ ప్లస్ సంస్థలోని ఉద్యోగులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఫిట్‌నెస్ ప్లస్‌ను పూర్తిగా పునరుద్ధరించిన 'హెల్త్ యాప్'లో విలీనం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. హెల్త్ మెట్రిక్స్ అండ్ బెంచ్‌మార్క్‌లను వివరించడానికి ఆపిల్ ఇప్పటికే రాబోయే హెల్త్ యాప్ రీడిజైన్‌లో ఇన్‌స్ట్రక్షనల్ వీడియో క్లిప్‌లను రూపొందిస్తోందని, భవిష్యత్‌లో ఇవి ఫిట్‌నెస్ ప్లస్ కంటెంట్‌తో అనుసంధానించబడే అవకాశం ఉందని తెలుస్తోంది.