నీతికథ: ఎవరిని పడితే వారిని నమ్మొద్దు.. నక్కలాగా మోసం చేసేవారు ఉంటారు జాగ్రత్త..!

నీతికథ: ఎవరిని పడితే వారిని నమ్మొద్దు.. నక్కలాగా మోసం చేసేవారు ఉంటారు జాగ్రత్త..!

ప్రపంచంలో అందరి ఆలోచనలు ఒక రకంగా ఉండవు. ఒకరి ఆలోచనలు ఒకరికి పాయపడితే.. మరొకరు ఇతరులను ఎలా మోసం చేయాలా అని ఆలోచిస్తుంటారు. కొంతమంది ఎదుటి వారిని మాటలతొ బురిడీ కొట్టి.. తన పబ్బం గడుపుకుంటారు.  అలాంటి వ్యక్తులను అస్సలు నమ్మకూడదు.. నమ్మితే మొదటికే మోసం వస్తుందని తెలిపే నీతి కథను తెలుసుకుందాం. . !

అనగనగా ఒక అడవిలో 'కరాళకేసరి' అనే సింహం ఉండేది. అది అడవిలోని జంతువులన్నింటికీ రాజు. దాని దగ్గర ఒక నక్క మంత్రిగా పనిచేసేది. దానిపేరు ధూసరకం. ఒకసారి సింహం కాలికి పెద్ద ముల్లు గుచ్చుకుని, గాయమైంది. దాంతో అది వేటాడలేకపోయింది. 

అప్పటివరకు.. సింహం వేటాడి తెచ్చిన మాంసంలో అది తినగా... మిగిలింది నక్క తినేది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో సింహం వేటాడలేదు. దాంతో సింహం నక్కను పిలిచి 'నువ్వు నీ తెలివితేటలతో ఏదైనా జంతువుని నా దగ్గరకు తీసుకురా. నేను దాన్ని చంపుతాను. ఇద్దరికీ సరిపడా తిండి దొరుకుతుంది' అంది.నక్క 'సరే'నని చెప్పి బయల్దేరింది. అది నడిచి నడిచి అడవి పక్కనున్న ఒక ఊరికి చేరింది.


ఆ ఊళ్లో బక్కచిక్కిన ఒక గాడిద కనిపించింది. గాడిద దగ్గరకు వెళ్లిన నక్క ...గాడిద మామా! గాడిద మామా! ఏంటి ఇలా బక్కచిక్కిపోయావు?'' అని అడిగింది."నా యజమాని సరిగా తిండి పెట్టడంలేదు” అంది గాడిద."అయ్యో! పాపం! నాతో అడవికి రా.. బోలెడంత పచ్చిక దొరుకుతుంది. నువ్వు కావాల్సినంత తినొచ్చు" అంది నక్క.

"అమ్మో! క్రూర జంతువులుంటాయి. నేను రాను నక్క అల్లుడూ..." అంది గాడిద.."భయపడకు గాడిద మామా! నేనుండగా నీకు భయమేంటి. ఈ గాడిద చాకిరీ మానేసి, నాతో రా. ఇంతకుముందు ఇలానే ఓ నాలుగు ఆడ గాడిదలు అడవికి వచ్చాయి. అవి వయసులో ఉన్నాయి. వాటికి పెళ్లి చేద్దామనుకుంటున్నా. 

పెళ్లికొడుకుని వెతుకుతుంటే నువ్వు కనిపించావు. ఎటూ నీక్కూడ పెళ్ళి కాలేదు కదా! వాళ్ళల్లో ఒకర్ని పెళ్లి చేసుకుందువు" అంది నక్క.నక్క మాటలు నమ్మిన గాడిద. దానివెంట అడవిలోకి వెళ్లింది. నక్క... గాడిదను నేరుగా సింహం దగ్గరకు తీసుకెళ్లింది. సింహాన్ని చూడగానే భయపడి గాడిద పారిపోయింది.
ఇలా జరిగింది ఏమిటా? అని నక్క.. సింహం బాధపడ్డాయి. ఈసారి ఎలాగైనా గాడిదను చంపాలి అనుకున్నాయి.

నక్క మళ్లీ ఊళ్లోకి వెళ్లింది. గాడిదను కలిసింది. "ఏమిటి మామా! పారిపోయావు" అని అమాయకత్వం నటిస్తూ అడిగింది."సింహాన్ని చూసి భయపడ్డాను అల్లుడు" అంది గాడిద."హా..హా!" అని పెద్దగా నవ్వింది నక్క. "నువ్వూ పొరబడ్డావు మామా! అది సింహం కాదు, అడవిలో పచ్చిక మేసి, బాగా బలిసిన ఓ ఆడ గాడిద" అంది నక్క.

నక్క మాటలు నమ్మిన గాడిద మరోసారి నక్కతో కలసి వెళ్లింది. ఈ సారి సింహం... గాడిద దగ్గరకు రాగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా మెడ పట్టుకుని కొరికి చంపింది.తర్వాత.. సింహం "నేను స్నానం చేసి వస్తాను. ఈ గాడిద మాంసానికి నువ్వు కాపలాగా ఉండు"అని నక్కతో చెప్పి వెళ్లింది.
సింహం అలా వెళ్ళగానే గాడిద మెదడును తృప్తిగా తినేసింది నక్క.

స్నానం చేసి తిరిగి వచ్చిన సింహం గాడిద కళేబరాన్ని చూసి "ఇదేమిటి? ఇందులో మెదడు లేదు" అంది.అందుకు నక్క ఇలా సమాధానమిచ్చింది. "మహారాజా! మెదడే ఉంటే ఈ గాడిద ఇలా చావును వెతుక్కుంటూ వస్తుందా? అది లేదు గాబట్టే మీ దగ్గరకు వచ్చింది" అని తెలివిగా సమాధానం ఇచ్చింది.