అంగన్‌‌‌‌ వాడీలకు గుడ్ న్యూస్: సర్వీస్ బెనిఫిట్స్ పెరిగాయి.. టీచర్లకు రూ.2 లక్షలు,హెల్పర్లకు రూ.లక్ష

అంగన్‌‌‌‌ వాడీలకు గుడ్ న్యూస్: సర్వీస్  బెనిఫిట్స్  పెరిగాయి.. టీచర్లకు రూ.2 లక్షలు,హెల్పర్లకు రూ.లక్ష
  • 60 ఏళ్లు దాటి స్వచ్ఛందంగా వైదొలిగినా ప్రయోజనం
  • ఇప్పటివరకు 2,572 మందిఖాతాల్లో రూ.15.61 కోట్లు జమ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని అంగన్‌‌‌‌వాడీ టీచర్లు, హెల్పర్లకు పదవీ విరమణ ప్రయోజనాలను (సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్) ప్రభుత్వం పెంచింది. 65 ఏండ్ల వయస్సు పూర్తై రిటైర్ అయ్యే వారితో పాటు 60 ఏండ్లు నిండిన తర్వాత విధుల నుంచి స్వచ్ఛందంగా తప్పుకునే వారికి కూడా ఈ ప్రయోజనాలు వర్తింపజేస్తున్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026-=27) ఇప్పటివరకు 2,572 మంది అంగన్‌‌‌‌వాడీ సిబ్బంది ఖాతాల్లో మొత్తం రూ.15.61 కోట్ల నిధులు జమ అయ్యాయి. 

ఆర్థిక సాయం డబుల్

కేంద్ర ప్రభుత్వ ‘మిషన్ సక్షమ్ అంగన్‌‌‌‌వాడీ–పోషణ్ 2.0’ మార్గదర్శకాల ప్రకారం అంగన్‌‌‌‌వాడీ సిబ్బంది గరిష్ట పదవీ విరమణ వయస్సును 65 ఏండ్లుగా నిర్ణయించారు. గతంలో సర్వీస్ ముగిసిన తర్వాత అంగన్‌‌‌‌ వాడీ టీచర్లకు రూ. లక్ష, హెల్పర్లకు రూ.50 వేలు అందించేవారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం రెట్టింపు చేసింది. 

దీని ప్రకారం 65 ఏండ్లకు రిటైర్ అయ్యే టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ. లక్ష చొప్పున సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్ అందిస్తున్నారు. అలాగే వాలంటరీ డిస్‌‌‌‌ ఎంగేజ్‌‌‌‌మెంట్ తీసుకునే వారికి సైతం ఇదే మొత్తాన్ని వర్తింపజేస్తున్నారు.

ఖాతాల్లోకి రూ.15.61 కోట్లు

నిబంధనల ప్రకారం 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం రూ.15. 61 కోట్లను లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. ఇందులో జీవో నెం.10 ప్రకారం 473 మంది అంగన్‌‌‌‌వాడీ టీచర్లకు రూ.4.73 కోట్లు, 1,930 మంది హెల్పర్లకు రూ.9.65 కోట్లు చెల్లించారు. 

జీవో నెం.8 ప్రకారం పెంచిన మొత్తంతో 14 మంది టీచర్లకు రూ.28 లక్షలు, 59 మంది హెల్పర్లకు రూ.59 లక్షలు విడుదలయ్యాయి. వీటితో పాటు గతంలో అమల్లో ఉన్న జీవో నెం.19 ప్రకారం మరో 96 మంది సిబ్బందికి రూ.36.10 లక్షల బెనిఫిట్స్‌‌‌‌ ను సైతం ప్రభుత్వం చెల్లించింది.