- టీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్
- మంత్రి పొంగులేటికి వినతి పత్రం
హైదరాబాద్ సిటీ, వెలుగు: జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం విధానాన్ని ప్రకటించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపులో జాప్యం చేయడం సరికాదని పేర్కొంది. సోమవారం టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ సెక్రటేరియేట్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోని కేబుల్, ఐపీ న్యూస్ ఛానళ్లకు అక్రెడిటేషన్ సౌకర్యం కల్పించాలని, కేబుల్ ఛానళ్లకు జిల్లాస్థాయిలో నాలుగు, రాష్ట్రస్థాయిలో 12 అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు.
అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్ కార్డులు అందించి ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానల్లో ఉచిత వైద్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా చట్టపరమైన మార్గాలను పరిశీలించి ఇండ్ల స్థలాలు కేటాయించాలని, మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలను కూడా పథకంలో చేర్చాలని కోరారు. సీనియర్, రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్, జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య, అందరికీ ఉచిత జీవిత బీమా కల్పించి జర్నలిస్టు మరణిస్తే రూ.10 లక్షల పరిహారం అందించాలని కోరారు. కుంచం శ్రీనివాస్, రవికుమార్ పాల్గొన్నారు .
