ఏడు కొండలవాడా.. వెంకట రమణా.. గోవిందా... గోవిందా.. అంటూ తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని భక్తులు దర్శించుకుంటారు. భక్తులు రక రకాలుగా మొక్కులు చెల్లిస్తూ స్వామిని దర్శించుకుంటారు. చాలా మంది భక్తులు అలిపిరి నుంచి మెట్ల మార్గంలో నడుచుకుంటూ తిరుమల కొండ ఎక్కుతారు.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. వీరిలో కొందరు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా నడకదారిలో స్వామివారిని చేరుకుంటారు. అయితే, ఈ మార్గంలో వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రయాణించడం చాలా కష్టంగా ఉంటుంది.
అయితే కర్నాటకకు చెందిన 116 ఏళ్ల బామ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల మెట్లు ఎక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నడవడమే కష్టమైన వృద్ధాప్యంలో.. ఆమె ఏకంగా తిరుమల కొండనే కాలినడకన అధిరోహించి అందరినీ అశ్చర్యపరిచారు.
కర్ణాటకకు చెందిన ఈ వృద్ధురాలికి శ్రీవారిపై అపారమైన భక్తి ఉంది. ఈ వయసులో కొండ ఎక్కడం సాధ్యం కాదని అందరూ అనుకున్నా.. ఆమె మాత్రం వెనకడుగు వేయలేదు. తన దృఢ సంకల్పంతో తిరుమల శ్రీవారి మెట్ల మార్గాన్ని ఎంచుకున్నారు. కుటుంబ సభ్యులు పక్కనే ఉండి చేతులు పట్టుకుని నడిపిస్తుంటే, అలసట అనేదే లేకుండా ఉత్సాహంగా అడుగులో అడుగు వేస్తూ కొండపైకి చేరుకున్నారు. బామ్మ పట్టుదలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
వృద్ధురాలి భక్తికి, ఆమె పట్టుదలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇది కేవలం మానవ ప్రయత్నం మాత్రమే కాదు.. ఆ శ్రీనివాసుడి అపారమైన అనుగ్రహం ఉంటేనే ఇది సాధ్యమని 116 ఏళ్ల నిరూపించారు. వయసును లెక్కచేయకుండా ఆ బామ్మ చూపిన ఈ అంకితభావం నిజంగా ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది.శారీరక దృఢత్వం కంటే విశ్వాసం గొప్పదని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని ప్రశంసిస్తున్నారు.
