భారత్‌కు భూటాన్ షాక్.. E20 పెట్రోల్ వద్దని తేల్చి చెప్పేసింది

భారత్‌కు భూటాన్ షాక్.. E20 పెట్రోల్ వద్దని తేల్చి చెప్పేసింది

పర్యావరణహిత ఇంధనాల వైపు వేగంగా దూసుకెళ్తున్న భారత్‌కు పొరుగు దేశం భూటాన్ ఊహించని షాక్ ఇచ్చింది. ఇథనాల్ మిక్స్ చేసి తయారైన E20 పెట్రోల్‌ను సరఫరా చేయాలని భారత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చేసిన ప్రతిపాదనను భూటాన్ స్పష్టంగా తిరస్కరించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ నిర్ణయం పర్యావరణంపై వ్యతిరేకత వల్ల కాదు.. తమ దేశంలోని ఇంధన నిల్వ వ్యవస్థలు E20కి అనుకూలంగా లేకపోవడమే కారణం అంటూ తప్పించుకుంది.

E20 పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ ఉంటుంది. ఇథనాల్‌కు గాలిలోని తేమను వేగంగా పీల్చుకునే స్వభావం ఉంటుంది. దీంతో నిల్వ ట్యాంకుల్లోకి నీరు చేరితే ఇంధనం విడిపోవడం, నాణ్యత తగ్గిపోవడం, వాహనాల పనితీరుపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. భూటాన్‌లోని చాలా ఇంధన డిపోలు కొండ ప్రాంతాల్లో ఉండటంతో తేమ, నీటి లీకేజీని పూర్తిగా అరికట్టడం కష్టమని అక్కడి అధికారులు చెబుతున్నారు. అందుకే ప్రస్తుతం E20 పెట్రోల్‌ సేఫ్ కాదని భూటాన్ ముందుగానే గుర్తించింది.

పాత వాహనాలకు అదనపు భారం..
భూటాన్‌లో నిర్వహించిన అధ్యయనాల ప్రకారం E20కు పూర్తిగా అనుకూలం కాని పాత వాహనాల్లో విడిభాగాల మార్పు, ప్రత్యేక ఇంధన యాడిటివ్‌ల కోసం ప్రతి సంవత్సరం రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు అదనపు ఖర్చు వచ్చే అవకాశం ఉందని అంచనా. దీంతో కొత్త ఇంధనం వల్ల వినియోగదారులపై ఆర్థిక భారం కూడా పెరిగే ప్రమాదం ఉందని అక్కడి ప్రభుత్వంతో పాటు నిపుణులు గ్రహించారు. 

భారత్‌కు పెద్ద పాఠమే..
భారత్ ముడి చమురు దిగుమతులను తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, బయోఫ్యూయెల్ ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌ను వేగంగా విస్తరిస్తోంది. అయితే భూటాన్ నిర్ణయం ఒక కీలక సందేశాన్ని ఇస్తోంది. కేవలం ఇంధనం అందుబాటులో ఉండటం సరిపోదు.. దాన్ని సేఫ్ గా నిల్వ చేసే మౌలిక సదుపాయాలు కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేసింది. భారతదేశంలో మంత్రులు మాత్రం తాము లక్ష్యం కంటే ముందే ఇథనాల్ పెట్రోల్ అమ్మేస్తున్నాం అని చంకలు బాదుకుంటుంటే.. క్షేత్రస్థాయిలో సేఫ్టీ, నిల్వ సామర్థ్యాలు, వాహనదారులకు వచ్చే ఇబ్బందులను గాలికి వదిలేస్తున్నారనే విమర్శలు పెరిగిపోతున్నాయి.

పెట్రోల్ రేటుకే ఇథనాల్ అంటే ఎలా..
బ్రెజిల్ వంటి దేశాల్లో అధిక ఇథనాల్ ఇంధనాలకు సబ్సిడీలు ఇస్తుండగా.. భారత్‌లో మాత్రం E20 పెట్రోల్ సాధారణ పెట్రోల్ ధరలకే విక్రయిస్తున్నారు. అయితే తక్కువ మైలేజ్, పాత వాహనాల నిర్వహణ ఖర్చు వంటి అంశాలపై ఇప్పటికే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భూటాన్ తీసుకున్న నిర్ణయం ప్రాంతీయ ఇంధన సహకారంలో కొత్త చర్చకు తెరతీసింది. భవిష్యత్తులో క్లీన్ ఎనర్జీని ఇతర దేశాలకు విస్తరించాలంటే ఇంధనం మాత్రమే కాదు.. వాటిని నిల్వ చేసే వ్యవస్థతో పాటు అక్కడి వాహనదారుల నుంచి అనుకూలత కూడా ఉండాల్సిందేనని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.