హిమాచల్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఖర్చులు తగ్గించేందుకు భారీగా IAS, IPS పోస్టుల కోత..!

హిమాచల్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఖర్చులు తగ్గించేందుకు భారీగా IAS, IPS పోస్టుల కోత..!

సిమ్లా: అడ్మినిస్ట్రేషన్‎లో అత్యంత కీలకమైన ఐఏఎస్, ఐపీఎస్‎ పోస్టుల విషయంలో హిమాచల్ ప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ యంత్రాంగ ఖర్చులను తగ్గించేందుకు రాష్ట్రంలో ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత సర్వీసుల (AIS) కేడర్ పోస్టుల సంఖ్యను తగ్గించాలని యోచిస్తోంది. ఈ మేరకు రాబోయే కేడర్ సమీక్షలో ఈ పోస్టుల సంఖ్యను తగ్గించేలా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ అయ్యింది.

అవసరానికి మించి ఉన్నరు: సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు 

రాష్ట్రంలో ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ అధికారుల కేడర్ సంఖ్యను తగ్గించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ధృవీకరించారు. హిమాచల్ ప్రదేశ్‌లో రాష్ట్రానికి వాస్తవంగా అవసరమైన దానికంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారని తెలిపారు. 

153 మంది ఐఏఎస్ అధికారులు ఉండగా వారిలో చాలా మందిని చిన్న చిన్న శాఖలకు కేటాయించామని.. దీంతో అధికారులు వారి ప్రతిభను పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే ఐఏఎస్ కేడర్ సంఖ్యను 153 నుంచి 130కి తగ్గించాలని నిర్ణయించామని తెలిపారు. ఆ సంఖ్యను 110కి తగ్గించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని.. మొదటి దశలో 130కి తగ్గిస్తామన్నారు.

►ALSO READ | CJP చలో పార్లమెంట్‎కు నో పర్మిషన్.. పరిస్థితి అదుపు తప్పడంతోనే లాఠీ చార్జ్: ఢిల్లీ పోలీస్

ఐఏఎస్‎తో పాటు ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పోస్టుల సంఖ్యను కూడా తగ్గించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అవసరమైన పోస్టులను మాత్రమే ఉంచి, మిగిలిన వాటిని తగ్గించడం ద్వారా రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం తగ్గుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పరిపాలనను మరింత సరళీకృతం చేయడానికి, క్షేత్రస్థాయిలో పనితీరును మెరుగుపరచడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.100–150 కోట్లు ఆదా కానున్నట్లు సమాచారం.