సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మాతృభూమి’. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ సొంత నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది. 2020లో గాల్వాన్ లోయలో భారత్–చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో దీన్ని తెరకెక్కిస్తున్నారు. బీహార్ రెజిమెంట్ కమాండర్ కల్నల్ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ కనిపించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 17న విడుదల కావల్సి ఉండగా ఆగస్టుకు వాయిదాపడింది.
అయితే మరోసారి సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు క్లియరెన్స్ ఇవ్వడానికి నిరాకరించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. చైనా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో సినిమా కావడంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ అభ్యంతరం చెప్పడంతో సెన్సార్ బోర్డ్ ఈ సినిమాను హోల్డ్‌లో పెట్టినట్టు సమాచారం. అయితే ఆ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాత్రం దీంతో తమకు ఎలాంటి ప్రమేయం లేదని, అది సెన్సార్ బోర్డు చూసుకుంటుందని స్పష్టం చేశారు.
మొదట ఈ చిత్రం టైటిల్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ కాగా, ‘మాతృభూమి’గా మార్చిన విషయం తెలిసిందే. టైటిల్ మారడంతో పాటు మరోసారి రిలీజ్ వాయిదా పడబోతోందని వస్తున్న వార్తల నేపథ్యంలో సల్మాన్ ఫ్యాన్స్ మూవీ అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో చిత్రాంగద సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా ముఖేష్ రిషి, అంకుర్ భాటియా, అభిలాష్ చౌదరి కీలకపాత్రలు పోషిస్తున్నారు.
