అమెరికాలో ఇంటికే గన్స్ డెలివరీ.. ట్రంప్ కొడుకుకే భారీ లాభమా?

అమెరికాలో ఇంటికే గన్స్ డెలివరీ.. ట్రంప్ కొడుకుకే భారీ లాభమా?

ఇప్పటికే అమెరికాలో గన్ కల్చర్ కారణంగా ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో, ఎంత మంది ప్రాణాలు పోయాయో మనం అనేకమార్లు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా అమెరికాలో తుపాకుల కొనుగోలు విధానంలో దశాబ్దాల తర్వాత అతిపెద్ద మార్పుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో గన్ కొనుగోలు చేసినా.. చివరకు లైసెన్స్ ఉన్న గన్ షాప్‌కు వెళ్లి గుర్తింపు వెరిఫికేషన్, బ్యాక్‌గ్రౌండ్ చెక్ పూర్తి చేసిన తర్వాతే ఆయుధాన్ని తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ ప్రక్రియ పూర్తిగా మారే అవకాశం కనిపిస్తోంది. కొత్త రూల్స్ అమల్లోకి వస్తే అర్హులైన కొనుగోలుదారుల ఇంటికే గన్స్ నేరుగా డెలివరీ అవుతాయి.

ఇలా ఉంటే చాలు.. ఇంటికే డెలివరీ
అమెరికా బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్ ఆర్మ్స్ అండ్ ఎక్స్‌ప్లోసివ్స్(ATF) ప్రతిపాదించిన కొత్త విధానం ప్రకారం కొనుగోలుదారులు ఆన్‌లైన్‌లో తమ గుర్తింపును ధృవీకరించాలి. అనంతరం బ్యాక్‌గ్రౌండ్ చెక్‌లో క్లియర్ కావాలి. తప్పనిసరిగా 7 రోజుల వెయిటింగ్ పీరియడ్ పూర్తవ్వాలి. అంతేకాదు డెలివరీకి ముందు స్థానిక పోలీసులకు సమాచారం కూడా ఇవ్వాలి. ఈ నిబంధనలన్నీ పూర్తి అయితే లైసెన్స్ ఉన్న డీలర్లు అదే రాష్ట్రంలో కొనుగోలుదారుల ఇంటికే గన్ పంపించే అవకాశం ఉంటుంది.

ట్రంప్ జూనియర్‌కు భారీ ప్రయోజనమా?
ఈ ప్రతిపాదనతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ పేరు కూడా వార్తల్లో నిలిచింది. ఆయన ఆన్‌లైన్ గన్ విక్రయ సంస్థ 'గ్రాబ్‌ఏగన్' బోర్డు సభ్యుడిగా ఉండటంతో పాటు కంపెనీలో భారీ వాటాలు హోల్డ్ చేస్తున్నారు. ఈ కంపెనీ గన్స్‌కి అమెజాన్ లాంటిది. ఆన్‌లైన్ ద్వారా గన్స్ కొనుగోలు మరింత సులభమైతే ఈ సంస్థ వ్యాపారం భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ ప్రతిపాదన రూపకల్పనలో తనకు ఎలాంటి పాత్ర లేదని ట్రంప్ జూనియర్ స్పష్టం చేశారు. కంపెనీ సీఈఓ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నప్పటికీ.. కొత్త విధానం అమలైతే తమ సంస్థకు పెద్ద అవకాశాలు ఏర్పడతాయని అంగీకరించారు.

గన్ షాపుల్లో ఆందోళన..
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన గన్స్‌ను డీలర్ల ద్వారా అందజేస్తుండటంతో వారికి ట్రాన్స్‌ఫర్ ఫీజులు, అదనపు అమ్మకాలు వస్తున్నాయి. ఇంటికే డెలివరీ ప్రారంభమైతే ఆ ఆదాయం తగ్గిపోతుందని అనేక గన్ షాప్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గన్ కొనే వ్యక్తిని నేరుగా కలిసిన సమయంలో అనుమానాస్పద ప్రవర్తనను గుర్తించే అవకాశం ఉంటుందని.. కానీ ప్రాసెస్ మెుత్తాన్ని పూర్తిగా ఆన్‌లైన్ విధానం భద్రతపై ప్రశ్నలు తలెత్తిస్తుందని వారు చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతోంది అమెరికాలో. ఆగస్టు ప్రారంభం వరకు అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత ATF తుది నిర్ణయం తీసుకోనుంది. ఆమోదం లభించినా వెంటనే అమల్లోకి వచ్చే అవకాశం లేదు. నిబంధనల రూపకల్పన పూర్తవ్వడానికి 2026 చివరి వరకు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే అమెరికాలో గన్స్ కొనుగోలు విధానంలోనే కాదు, ఆన్‌లైన్ గన్ వ్యాపారంలో కూడా భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అయితే మెున్నటి వరకూ క్రిప్టోలు, యుద్ధంతో క్రూడ్ ఆయిల్ పై బెట్టింగ్ వేసి సంపాదించిన ట్రంప్ ఫ్యామిలీ ఇప్పుడు ఇంకో దారి కూడా వెతుక్కుంటోందనే విమర్శలు తాజా నిర్ణయంపై వెల్లువెత్తుతున్నాయి.