ఒక్క ఇటుక వేయలేదు.. అక్కడ ఆసుపత్రే లేదు.. ఆరేళ్ల నుంచి 100 పడకల ఆసుపత్రి నడుస్తుందంట !

ఒక్క ఇటుక వేయలేదు.. అక్కడ ఆసుపత్రే లేదు.. ఆరేళ్ల నుంచి 100 పడకల ఆసుపత్రి నడుస్తుందంట !

ఇండోర్‌: మధ్యప్రదేశ్లోని ఇండోర్‌లోని ఖజ్రానా ప్రాంతంలో ప్రతిపాదించబడిన 100 పడకల సివిల్ ఆసుపత్రికి ఒక్క ఇటుక కూడా వేయకపోయినా, కనీసం భూమిని కూడా ఖరారు చేయకపోయినా, ఆరేళ్లుగా "కాగితాల మీద" మాత్రమే పూర్తి స్థాయిలో పనిచేస్తోంది.

ఆరు సంవత్సరాల క్రితం.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఖజ్రానాలో ఒక ఆధునిక సివిల్ ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. తగిన స్థలం కోసం అన్వేషణ సాగుతుంది. ఇప్పటికీ అధికార యంత్రాంగం తన పనిని కొనసాగిస్తూనే ఉంది.

ఉనికిలో లేని ఈ ఆసుపత్రి కోసం వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది.. ఇలా సదరు వైద్యఆరోగ్య శాఖ కాగితాలపై 87 మంది వైద్య సిబ్బందిని ఈ ఉనికిలో లేని హాస్పిటల్ కోసం రిక్రూట్ చేసింది. ఈ ఉద్యోగులలో సుమారు 80 మంది.. నగరవ్యాప్తంగా ఉన్న పిసి సేథి ఆసుపత్రి, హుకుంచంద్ ఆసుపత్రి, స్థానిక సంజీవని క్లినిక్‌లతో సహా పలు హాస్పిటల్స్లో పనిచేస్తున్నారు.

ఆరేళ్ల నుంచి జీతం తీసుకుంటున్నారు. లేని ఆసుపత్రి కోసం ఉద్యోగుల నియామకాలు ఏంటని ప్రతిపక్షం ప్రశ్నించింది. ప్రభుత్వం ఇలా కాగితాల మీద లెక్కలు చూపించి అవినీతికి పాల్పడుతుందని ఆరోపించింది. 

ALSO READ : ఒకే ఒక్క రాత్రి వర్షానికి కుంగిపోయిన 12 వేల కోట్ల జాతీయ రహదారి..!

మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి రాజేంద్ర శుక్లా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. ఆ స్థలంలో గతంలో ఒక పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండేదని, దానిని తరువాత ప్రతిపాదిత 50 పడకల, ఆపై 100 పడకల సివిల్ ఆసుపత్రిగా ప్రతిపాదన చేశారని చెప్పారు.

భూమి లభ్యం కాకపోవడం వల్ల ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని, తగిన భూమిని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతుండగా, మంజూరైన సిబ్బందిని ఇతర ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో సర్దుబాటు చేశామని ఆయన తెలిపారు.