భారీ వర్షంలో మొక్కలకు నీళ్లు పెడుతున్న వీడియో వైరల్.. ఏంటన్నా ఇది అని అడిగితే..

భారీ వర్షంలో మొక్కలకు నీళ్లు పెడుతున్న వీడియో వైరల్.. ఏంటన్నా ఇది అని అడిగితే..

పుణె: మహారాష్ట్రలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ముంబై, పుణె నగరాల్లో భారీ వర్షాలు పడుతున్నా ఈ రెండు నగర ప్రజలకు నీళ్ల తిప్పలు తప్పడం లేదు. పుణె మున్సిపల్ కార్పొరేషన్లో నీళ్ల కొరత పరిస్థితులున్నాయి.

అలాంటి పరిస్థితుల్లో.. పుణె మున్సిపల్ కార్పొరేషన్‌ తీరుపై పుణె నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుణెలోని పౌడ్ రోడ్డులో భారీ వర్షం కురుస్తున్న సమయంలో డివైడర్ పక్కన ఒక వాటర్ ట్యాంకర్ నుంచి మొక్కలకు నీళ్లు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

నగరంలో నీళ్ల కోతలు విధిస్తూ.. వర్షంలో మొక్కలకు నీళ్లు పోయడం ఏంటని పుణె వాసులే కాదు ఈ వీడియో చూసిన నెటిజన్లు నిలదీస్తున్నారు. అయితే.. పుణె మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ మున్సిపల్ కమిషనర్ ఈ వీడియోపై స్పందించారు.

ఆ డివైడర్‌కు పైన ఎలివేటెడ్ మెట్రో రూట్ కోసం కట్టిన ఒక బ్రిడ్జ్ ఉందని.. అక్కడ ఎంత వర్షం కురిసినా మొక్కలకు నీళ్లు అందవని.. అందుకే మొక్కలను కాపాడటానికి ఉద్యోగి వాటికి నీళ్లు పోశారని పుణె మున్సిపల్ కార్పొరేషన్ అదనపు మున్సిపల్ కమిషనర్ ఓంప్రకాష్ దివాటే ఈ వీడియోపై వివరణ ఇచ్చారు.