హైదరాబాద్: బీఆర్ఎస్కు అధికారం ఇక కలేనని.. ఆ పార్టీకి గతం తప్ప భవిష్యత్ లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేత పదవి ఇచ్చిన ప్రజా సమస్యలపై మాట్లాడడు అంటా కానీ అధికారం ఇస్తే దోచుకునేందుకు మాత్రం బయటకు వస్తాడంటా అని కేసీఆర్‌ను విమర్శించారు. ఆ పశుపతి ఇక ఫామ్‌హౌస్ లోనే కుంగి కృశించి పోవాల్సిందే. అధికారం అనేది ఇక వాళ్లు మరిచిపోవాల్సిందేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం (జూలై 4) మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు.
మిడ్చిల్ జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై 20 ఏండ్లు అవుతున్నందున స్థానిక నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. అహంకారానికి, అహంభావానికి ఒక హద్దు ఉంటుంది. యుద్ధ నౌక, పేదల గళం గద్దర్ అన్నను గడీల ముందు నిలబెట్టిన మీకు ఉరి శిక్ష వేసినా తక్కువే. ప్రజా ప్రభుత్వంలో పేదలకు సన్నబియ్యం ఇచ్చిన మాట వాస్తవం కాదా..? రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
పదేళ్లలో 8 లక్షల 21 వేల కోట్లు అప్పులు చేసిన కేసీఆర్ ప్రజలకు ఏం చేశారు.. ఏ ఊరిలోనైనా డబుల్ బెడ్రూంలు ఇచ్చారా..? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ఇచ్చారా..? దళితులకు మూడెకరాలు ఇచ్చారా..? కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. పాపాల భైరవుడు కేసీఆర్ మళ్లీ రావాలని ఆయన కొడుకు, అల్లుడు తిరుగుతున్నారు. పదేళ్లలో నీళ్లు ఇవ్వలే, నిధులు ఇవ్వలే, ఉద్యోగాలు ఇవ్వలే. అసలు వీళ్లు మళ్లీ ఎందుకు రావాలి..? ప్రజా పాలన ఎందుకు పోవాలని నిలదీశారు.
కొత్త రేషన్ కార్డులు ఇచ్చినందుకా..? లేదా పేదలకు సన్నంబియ్యం ఇచ్చినందుకా..? ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకా..? రైతు రుణమాఫీ చేసినందుకా..? రైతు భరోసా ఇచ్చినందుకా..? చివరి గింజ వరకు కొని రైతుల ఖాతాల్లో 80 వేల కోట్లు వేసినందుకా..? గంజాయి, డ్రగ్స్ అమ్మే వాళ్లను జైల్లో పెట్టినందుకా..? ఏం అన్యాయం చేశామని ప్రజా ప్రభుత్వం పోవాలని బీఆర్ఎస్ను ప్రశ్నించారు. వాళ్ల సంపాదన, దోపిడీ, దొంగతనాలు ఆగిపోయాయనే మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
ALSO READ : మిడ్జిల్ ప్రజలు నాటిన మొక్క.. ఇవాళ మహా వృక్షమైంది: సీఎం రేవంత్
పదేళ్లలో ఏం వ్యాపారం చేశారని కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల సంపాదన వచ్చిందని ప్రశ్నించారు. చివరకు బతుకమ్మ చీరల్లోనూ కమీషన్లు దండుకున్న దుర్మార్గులు, నీచులని బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. అప్పులు తప్పులు చేసినవాళ్లు మళ్లీ వస్తే రాష్ట్రంలో ఫోన్ కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోలేరు. ఆడబిడ్డల మాటలు దొంగతనంగా వినేవాడు అసలు మనిషేనా అని నిప్పులు చెరిగారు. తెలంగాణలో 2034 వరకు కాంగ్రెస్‌దే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. దొరల అహంకారాన్ని మళ్లీ బొంద పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
