హైదరాబాద్: గడిచిన 20 ఏళ్లలో ఏనాడూ సెలవు తీసుకోలేదు. వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతునై ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొట్లాడాను. అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమంతో పాటు అభివృద్ధిని, అభివృద్ధితో పాటు దీర్ఘకాలికంగా పట్టిపీడిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేశానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం సందర్భంగా శనివారం (జూలై 4) మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో సీఎం రేవంత్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు , వాకిటి శ్రీహరితో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. మిడ్జిల్‌ను అభివృద్ధి చెందిన మండలంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఈ మండలంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి చేరాలి. అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మండలాన్ని దత్తత తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి గారిని కోరారు.
‘‘ఇక్కడ ప్రజలు నాకు సర్వం ఇచ్చారు. నన్ను పెంచి పోషించారు. ఆనాడు మొక్కనాటిన మిడ్జిల్ మండలాన్ని అభివృద్ధి చెందిన మండలంగా తీర్చిదిద్దే బాధ్యత నాపై ఉంది. కరవుతో అల్లాడుతున్న డార్క్ ఏరియా కాదు. వెలుగు నిండిన మండలంగా ప్రభుత్వ రికార్డుల్లో రావాలి’’ అని ఆకాంక్షను వ్యక్తం చేశారు.
“2026, జులై 4 నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మీద మిడ్జిల్ ప్రజలు ఒక చరిత్రను లిఖించిన రోజు. జెడ్పీటీసీగా గెలుపు నాది కాదు. ఈ మిడ్జిల్ మండల ప్రజలది. నిజాం సర్కార్ నుండి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఈ జిల్లా బిడ్డ బూర్గుల రామకృష్ణారావు పని చేశారు” అని గుర్తుచేశారు.
“ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గౌరవించబడిన జైపాల్ రెడ్డి, ఆయన ఎదుగుదలను తన చేతుల మీదుగా నడిపించిన ద్యాప గోపాల్ రెడ్డి గుడియాన్ పల్లి వాసి. మహేంద్రనాథ్ ఈ ప్రాంతం నుండి ఆదర్శంగా నిలబడిన గొప్ప నాయకుడు అని స్మరించుకున్నారు. యాప గోపాల్ రెడ్డితో పాటు, రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం” అని చెప్పారు.
“జెడ్పీటీసీగా నాతో పాటు పని చేసిన ఎంపీటీసీలు, సర్పంచ్‌లకు తెలుసు. ఆనాడు చాలా గ్రామాలకు రోడ్లు లేవు. అభివృద్ధి లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మిడ్జిల్ మండలాన్ని, అదే విధంగా గద్వాల్ శాసనసభ నియోజకవర్గంలోని గట్టు మండలాన్ని డార్క్ ఏరియాలుగా ప్రకటించారు. విద్య, వైద్యం, సాగు, తాగు నీరు.. ఎలాంటి సౌకర్యాలు లేని అత్యంత వెనుకబడిన మండలాలుగా ప్రకటించారు” అని ఆనాటి పరిస్థితులను వివరించారు.
“అత్యంత వెనుకబడిన ఈ మండల ప్రజలు 2006లో తీసుకున్న నిర్ణయంతో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు వచ్చింది. ఈరోజు ఈ మండలానికి కృతజ్ఞత చెల్లించాల్సిన బాధ్యత నా మీద ఉంది” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
“40 ఏళ్లుగా నానుతున్న ఎస్సీ ఉప కులాల వర్గీకరణ పరిష్కరించాం. వందేళ్లుగా జరగని వెనుకబడిన తరగతుల కులగణన చేశాం. లెక్క తేల్చడమే కాకుండా వారి వాటా వారికి ఇవ్వాలని సమస్యకు పరిష్కారం చూపించాం. ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినందుకే ఈ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకోగలిగాం” అని వివరించారు.
“నేను పుట్టింది గ్రామంలో. గ్రామంలో అన్ని కులాలు, మతాలు, అన్ని సమస్యలను, పేదవాడి కష్టాలను చూసుకుంటూనే నేను పెరిగాను. వ్యవసాయం తెలుసు. దుక్కి దున్నడం తెలుసు. విత్తనం వేయడం తెలుసు. భూమికి, విత్తనానికి ఉన్న బంధమేంటో, పేదవాడికి, పరిపాలన చేసే వాడికి ఉండవలసిన అవగాహన ఏందో తెలుసు” అని పేర్కొన్నారు.
“రాష్ట్రమంటే, దేశమంటే ఎక్కడో లేదు. 12 వేలపైచిలుకు గ్రామపంచాయతీలు కలిస్తేనే తెలంగాణ రాష్ట్రం. 6 లక్షలకుపైగా గ్రామాలు కలిస్తేనే భారతదేశం. గ్రామంలో సమస్యలు పరిష్కారమైతేనే మండలం, జిల్లా, రాష్ట్రం.. వరుసగా అభివృద్ధి సాధిస్తాయి. ఆ విధంగా అన్ని రాష్ట్రాల్లోని సమస్యలు పరిష్కారమైతే దేశం అభివృద్ధి చెందినట్టే” అని అన్నారు. మిడ్జిల్ మండలానికి ఏమిచ్చినా, చివరికి నా ప్రాణమిచ్చినా తక్కువే. వలసల పాలమూరును అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాపై ఉందని చెప్పారు.
