అత్యంత విషపూరితమైన గిరినాగులు తెలంగాణ రాష్ట్రంలోనూ కనిపించాయి. భద్రాద్రి కొత్తగూడెం అడవుల్లోని కొండలు, గుట్టల ప్రాంతాల్లో తమకు గిరినాగులు కనిపించాయని అటవీ గ్రామాల గిరిజనులు అటవీశాఖ అధికారులకు, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ స్నేక్ క్యాచర్లకు చెప్పారు. దీంతో వారు రంగంలోకి దిగి గిరినాగుల సంచారాన్ని అధికారిక ఆధారాలను సేకరించి తెలంగాణలోనూ గిరినాగులు సంచరిస్తున్నాయని ధ్రువీకరించారు.
గిరినాగులను మన దగ్గర నార్తర్న్ కింగ్ కోబ్రా అని పిలుస్తారు. దీని శాస్త్రీయనామం ఓఫియోఫాగస్ హన్నా. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషసర్పం. అత్యంత అరుదైన ఈ గిరినాగులను రాచనాగు, కింగ్ కోబ్రాగా కూడా పిలుస్తుంటారు.
స్నేక్ సొసైటీ అధ్యయనం
గతంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకే పరిమితమని భావించిన ఈ అతి ప్రమాదకరమైన పాములు, తాజాగా తెలంగాణలో కూడా ఉన్నట్లు అటవీ అధికారులు, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ పరిశోధకులు నిర్ధారించారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొండలు, కోనల్లో గిరినాగులు సంచరిస్తున్నాయని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ మొట్టమొదటిసారి గుర్తించిందని ఆ సొసైటీ ప్రధాన కార్యదర్శి అవినాష్ విశ్వనాథన్ తెలిపారు. ఈ గిరినాగుల ఉనికికి సంబంధించిన మొదటి అధికారిక ఆధారాలను సేకరించారు.
కొత్తగూడెం జిల్లాలో పాముల పరిశోధకులు నిర్వహించిన ప్రాథమిక అధ్యయనంలో గిరినాగుల జాతి విస్తరిస్తుందని గుర్తించారు. అటవీ గ్రామాల గిరిజనులు, అటవీ శాఖ అధికారుల నుంచి సేకరించిన గిరినాగుల ఫొటోలు, వీడియోల్లో గిరినాగుల సంచారం కనిపించింది. ఆంధ్రప్రదేశ్‌లోని పాపికొండ నేషనల్ పార్క్ అడవులతో అనుసంధానించి ఉన్న అశ్వరావుపేట అటవీ ప్రాంతంలో కింగ్ కోబ్రా జీవించడానికి అనువైన ఆవాసాలున్నాయని పరిశోధకులు గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం అటవీ ప్రాంతాల్లో గిరినాగు జాడలు, వాటి పుల్లల గూళ్లను గుర్తించారు.
అత్యంత విషపూరితం...
నలుపు, తెలుపు చారలు, ఇరవై అడుగుల పొడవు, పది కిలోల బరువుతో ఉండే ఈ గిరినాగులు నాలుగు అడుగుల ఎత్తులో పడగవిప్పి బుసకొట్టడం చూస్తే ఒళ్లు జలదరిస్తుంది.15 నుంచి 20 ఏళ్ల పాటు జీవించే ఈ పాము అత్యంత విషపూరితం. ఈ కింగ్ కోబ్రా కాటేసిందంటే దాని విషం మనిషిలోని నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందంటున్నారు అటవీశాఖ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, వన్యప్రాణి నిపుణుడు ఎ శంకరన్. గిరినాగు కాటు వేస్తే పది నిమిషాల్లోనే ప్రాణాలు పోతాయని ఆయన చెప్పారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తెలంగాణలోనూ గిరినాగుల సంచారం వెలుగుచూసిన నేపథ్యంలో ప్రజలు అత్యంత విషపూరితమైన దీని బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ సూచించింది. గిరినాగు కనిపిస్తే వీటిని చూసి భయపడి పరుగులు తీయకూడదు. వీటికి అడ్డుతగలకుండా దాని దారిన అది వెళ్లేలా మార్గం ఇవ్వాలి. గిరినాగులను చంపడం చట్టరీత్యా నేరం. ఇవి సాధారణంగా మనుషులకు దూరంగా, దట్టమైన అడవుల్లోనే నివసిస్తాయని ఆయన చెప్పారు. ఇవి కనిపించిన వెంటనే స్థానిక అటవీశాఖ అధికారులకు లేదా ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించాలి. దీన్ని స్వయంగా పట్టుకోవడం లేదా చంపడానికి ప్రయత్నించకూడదు.
పరిరక్షించాలి
గిరినాగులు అంతరించిపోయే ప్రమాదం ఉన్న సర్పజాతిగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) గుర్తించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం - 1972 కింద రక్షణ పొందిన కింగ్ కోబ్రా పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. గిరినాగులు విషపూరితమైన పలు జాతుల పాములను తింటూ మనుషులకు పరోక్షంగా మేలు చేస్తున్న వీటిని పరిరక్షించాల్సిన అవసరముందని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అవినాష్ విశ్వనాథన్ చెప్పారు. మనుషుల ప్రాణాలు తీస్తున్న విషపూరిత పాముల సంఖ్య పెరగకుండా నిరోధిస్తూ మానవాళికి మేలు చేస్తున్న గిరినాగులను చంపొద్దని ఆయన కోరారు.తెలంగాణలో తొలిసారిగా గిరినాగుల ఉనికి నమోదుకావడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమై, ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టారు. గిరినాగులు చాలా అరుదైనవి, అంతరించిపోతున్న జాతికి చెందినవి.
జీవవైవిధ్యానికి మేలు
గిరినాగులు జీవవైవిధ్యానికి తోడ్పడుతున్నాయి. గిరినాగులు ఎక్కువగా పాములను తిని జీవిస్తుంటాయి. సాధారణంగా నాగుపాము, జెర్రిపోతు, కట్లపాము, పొడపాములు, రక్తపింజర పాములు ఎక్కువగా మనుషులను కాటేస్తుంటాయి. వీటి వల్ల ఎక్కువగా ప్రాణాలు పోతున్నాయి. అయితే మనుషుల ప్రాణాలు తీస్తున్న ఈ పాములను గిరినాగులు తింటాయి. దాంతో వీటి సంఖ్య అదుపులో ఉంటుంది. అలా పరోక్షంగా మనుషులకు గిరినాగులు మేలు చేయడంతోపాటు విషపూరిత పాముల సంఖ్యను నియంత్రిస్తూ జీవవైవిధ్యాన్ని కాపాడుతున్నాయని ఈస్ట్రన్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీ వ్యవస్థాపకుడు మూర్తి కంఠిమహంతి చెప్పారు.
కనకగిరి కొండల్లో ఫోర్స్టెన్ క్యాట్ స్నేక్..
ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోని కనకగిరి కొండల్లో అరుదైన ఫోర్స్టెన్ క్యాట్ స్నేక్‌ను అటవీశాఖ అధికారులు గుర్తించారు. తెలంగాణలోని పులిగుండల రిజర్వ్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని కనకగిరి కొండల్లో ఈ పిల్లిపాము కనిపించడం గొప్ప జీవవైవిధ్యాన్ని చాటిచెబుతోంది. గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అడవులు, తిరుమల కొండల్లో కనిపించిన ఈ అరుదైన పాము తాజాగా తెలంగాణలోనూ ప్రత్యక్షమయ్యింది. ఇది ఎక్కువగా చెట్లపై కనిపిస్తుందని, 5 నుంచి 7.5 అడుగుల పొడవు వరకు పెరుగుతుందని ఖమ్మం అటవీశాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ చెప్పారు.
డచ్ ప్రకృతి శాస్త్రవేత్త ఎల్టియో అలెగొండాస్ ఫోర్స్టెన్ గౌరవార్థం దీనికి ఫోర్స్టెన్ క్యాట్ స్నేక్ అని పేరు పెట్టారు. స్వల్ప విషపూరితమై ఈ పాము జాతి కేవలం దక్షిణాసియాకే పరిమితమైందని, ఇది అంతరించిపోయే ప్రమాదమున్న జాతి సర్పంగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) గుర్తించిందని అధికారులు పేర్కొన్నారు. ఈ క్యాట్ స్నేక్ పెస్ట్ కంట్రోల్‌కు తోడ్పడుతూ మనుషులకు మేలు చేస్తాయని అధికారులు చెప్పారు. దట్టమైన అడవుల్లోని కొండలు, గుట్టలు, సరస్సులున్న ప్రాంతాల్లో ఈ అరుదైన పాము సంచరిస్తుందని, దీన్ని పరిరక్షిస్తే అవి పురుగులు, కీటకాలను తింటూ జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తాయని అధికారులు వివరించారు.
