భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్కు.. సీతంపేట, సుజాతనగర్ ప్రాంతాలు అనుకూలం

 భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో  గ్రీన్ ఫీల్డ్  ఎయిర్పోర్ట్కు.. సీతంపేట, సుజాతనగర్ ప్రాంతాలు అనుకూలం
  • కొత్త స్థలాలను గుర్తించిన రాజ్​ టెక్నాలజీస్​ సంస్థ
  • కేంద్ర మంత్రి రాంమోహన్​ నాయుడుకు వివరాలతో లేఖ రాసిన తుమ్మల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఎయిర్​పోర్ట్​కు అడ్డంకులు తొలుగుతున్నాయి. గ్రీన్​ ఫీల్డ్​ ఎయిర్​పోర్ట్​ ఏర్పాటుకు కొత్తగూడెం నియోజకవర్గంలోని సీతంపేట, సుజాతనగర్​ ప్రాంతాలు అనుకూలమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. 

కొత్త స్థలాలకు సంబంధించిన వివరాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్​ నాయుడుకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శనివారం లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు రిలీజ్​ చేశారు. గతంలో రెండు స్థలాలను ప్రతిపాదించగా, ఒకటి సాంకేతికంగా, మరొకటి ఆర్థికంగా అనుకూలం కాదని తేలడంతో గ్రీన్​ ఫీల్డ్​ ఎయిర్​పోర్ట్​ ప్రాజెక్టు ముందుకు సాగలేదన్నారు. 


ఈక్రమంలో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచనలతో స్వతంత్ర సాంకేతిక సంస్థ రాజ్​ టెక్నాలజీస్​తో రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయించింది. ఈ సంస్థ సీతంపేట, సుజాతనగర్​ ప్రాంతాలను గుర్తించింది. ఏటీఆర్–72,600 తరహా విమానాలకు అనుగుణంగా ఎయిర్​పోర్ట్​ను డెవలప్​ చేసే లక్ష్యంతో జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో భూమి లభ్యత, భూతల స్వరూపం, రన్​వే, దిశ, ఎత్తు పరిమితి. ఉపరితలాలు, పర్యావరణ అంశాలు, రవాణా సౌకర్యాలను రాజ్​ టెక్నాలజీస్​ సంస్థ సమగ్రంగా అధ్యయనం చేసిందని మంత్రి తెలిపారు. సీతంపేట, సుజాతనగర్​ ప్రాంతాల్లోని 667 ఎకరాల్లో ప్రతిపాదిత స్థలాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తరపున నివేదికను అందజేశామని తెలిపారు. ఎయిర్​పోర్ట్​ ఏర్పాటుతో భద్రాచలం సీతారామచంద్రస్వామి టెంపుల్, పర్యాటకం, పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందుతాయని మంత్రి పేర్కొన్నారు.