రెండ్రోజుల పాటు కొండగట్టు అంజన్న గుడిలో అంతరాలయ దర్శనం రద్దు

రెండ్రోజుల పాటు కొండగట్టు అంజన్న గుడిలో అంతరాలయ దర్శనం రద్దు

జగిత్యాల: ఆగస్ట్ 20, 21న.. అంటే రేపు, ఎల్లుండి కొండగట్టు శ్రీఆంజనేయస్వామి దేవస్థానము అంతరాలయ దర్శనం రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. గర్భాలయ మరమ్మతు పనులు జరుగుతున్నందు వల్ల భక్తుల లోపలి దర్శనం రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

భక్తులు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. మల్యాల మండలం ముత్యంపేట గ్రామ శివారులో కొండగట్టు ఆంజనేయుడి గుడి ఉంది. ఈ దేవాలయం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది.

అదేంటంటే.. ముత్యంపేట గ్రామానికి చెందిన సింగం సంజీవుడు అనే పశువుల కాపరి ఒకరోజు అడవిలో ఆవుల్ని మేపుతుంటాడు. ఒక ఆవు మందలోంచి తప్పిపోతుంది. ఆ ఆవును వెతుక్కుంటూ కొండగట్టు వరకు వస్తాడు సంజీవుడు. ఎండలో తిరిగి అలిసి ఒక చెట్టు నీడలో నిద్రపోతాడు. అప్పుడు అతనికి కలలో ఆంజనేయుడు కనిపించి 'నేను తంబోర పొదలో ఉన్నాను. నాకు గుడి కట్టించు. తప్పిపోయిన నీ ఆవు ఫలానా చోట ఉంది' అని చెప్పాడట. మెలకువ వచ్చాక సంజీవుడికి అక్కడి పొదల్లో వెలిగిపోతున్న హనుమంతుడి విగ్రహం కనిపించిందట. దాంతో, అతను కొండగట్టులో హనుమంతుడి గుడి కట్టించాడట.

ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే... ఇక్కడ హనుమంతుడు ఎక్కడా లేని విధంగా రెండు ముఖాల (నరసింహస్వామి, ఆంజనేయుడు)తో కనిపిస్తాడు. అంతేకాదు ఛాతి మీద సీతారాముల విగ్రహాలు ఉంటాయి. దగ్గర్లోని సీతమ్మ బావిలోని నీళ్లతో రోజూ స్వామివారికి అభిషేకం చేయడం ఇక్కడి ఆనవాయితీ. గర్భాలయానికి కుడివైపు వెంకటేశ్వర స్వామి, ఆండాల్... ఎడమవైపు శివపంచాయతన ఆలయం ఉంటాయి. ఈ ఆలయంలో హనుమాన్ జయంతి ఏడాదిలో రెండుసార్లు (చైత్ర, వైశాఖ మాసాల్లో) జరుగుతుంది. ఈ గుడి ప్రధాన గోపురానికి రెండు వైపులా ఏనుగు బొమ్మలు, గోపురం మీద ఆంజనేయుడి విగ్రహాలు చెక్కి ఉంటాయి.

ఆలయ ప్రాంగణంలోని ధర్మగుండంలో మునిగి, తలానీలాలు సమర్పించాక స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడికి దగ్గర్లో ఉన్న బేతాళ స్వామికి కోళ్లు, మేకలు కోసి, కల్లు సాక పోసి మొక్కులు చెల్లిస్తారు భక్తులు. పక్కనే ఉన్న గుహలోని శివలింగాన్ని దర్శించుకుని వెళ్తారు.