మెటాపై అమెరికాలోని 29 రాష్ట్రాలు సంచలన ఆరోపణలు చేశాయి. ఈ 29 రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులు కోర్టులో మెటాపై ఆరోపణలు చేశారు. మెటాకు చెందిన ఇన్స్టాగ్రాం టీనేజర్లకు వ్యసనంగా మారిందని అంతర్గత పరిశోధనలో తేలిందని.. ఈ పరిశోధన ఫలితాలను మెటా కప్పిపుచ్చిందని న్యాయవాదులు ఆరోపించారు. మెటాకు చెందిన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం పిల్లలకు హాని చేస్తాయని తెలిసినప్పటికీ.. ఆ సమాచారాన్ని ప్రజలకు తెలియకుండా మెటా దాచిపెట్టిందని కాలిఫోర్నియా డిప్యూటీ అటార్నీ జనరల్ మేగన్ ఓ'నీల్ చెప్పారు.
మెటా తన వంతు బాధ్యతను నిర్వర్తించలేదని ఆమె అభిప్రాయపడ్డారు. యువతను ఆకర్షించి, వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే వ్యసనకర ఉత్పత్తులను ఉద్దేశపూర్వకంగా మెటా రూపొందిస్తోందని.. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల మాతృ సంస్థ అయిన మెటాపై దాఖలైన వ్యాజ్యంపై కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్‌లో ఉన్న ఫెడరల్ కోర్టులో జ్యూరీ విచారణ జరుగుతోంది. ఈ విచారణ ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు కొనసాగే అవకాశం ఉంది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ , ఇన్‌స్టాగ్రామ్ సీఈఓ ఆడమ్ మోస్సెరి, ఇతర కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ల వాదనలను జ్యూరీ వింటుంది.
అక్టోబర్ 2023లో తొలిసారిగా దాఖలు చేసిన 233 పేజీల ఈ వ్యాజ్యం ప్రకారం.. ఫెడరల్, రాష్ట్ర చట్టాలను ఉల్లంఘిస్తూ, మెటా సంస్థ 13 ఏళ్లలోపు పిల్లల డేటాను వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండా క్రమం తప్పకుండా సేకరిస్తోందనేది ప్రధాన ఆరోపణ. మెటా కేవలం ఆర్థిక లాభాలను పెంచుకోవడానికే ఇలా చేస్తుందని చట్టసభ సభ్యులు కోర్టుకు సమర్పించిన పత్రాలలో పేర్కొన్నారు. 29 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ సంయుక్తంగా ఈ దావాను దాఖలు చేశారు. విచారణ సమయంలో మాత్రం.. కాలిఫోర్నియా, కొలరాడో, కెంటకీ, న్యూజెర్సీ తరపు న్యాయవాదులు నాయకత్వం వహిస్తారు.
మెటాపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటే మార్క్ జుకర్ బర్గ్ కంపెనీకి తీవ్రంగా నష్టపోయే అవకాశాలు లేకపోలేదు. మెటా బాధ్యత వహించాల్సి ఉంటుందని తేలితే.. 200 బిలియన్ డాలర్ల వరకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని అటార్నీ జనరల్స్ చెబుతున్నారు. అంటే ఈ ఫైన్ మొత్తం.. మెటా కంపెనీ 2025 వార్షిక ఆదాయానికి సమానం. మెటా అన్ని ఆరోపణలను ఖండించింది.
మెటా తరఫు న్యాయవాది పాల్ ష్మిత్ మాట్లాడుతూ.. ప్రభుత్వ న్యాయవాదులు జ్యూరీకి చూపించిన అంతర్గత పత్రాలు, ఇమెయిల్‌లు సందర్భం నుంచి వేరుచేసి, సుదీర్ఘ సంభాషణల నుంచి తమకు అనుకూలమైన పార్ట్స్ను మాత్రమే ఎంపిక చేసుకున్నారని అన్నారు. ఈ రంగంలో యువతకు మద్దతు ఇవ్వడానికి ఏం చేయగలమనే లక్ష్యంతోనే మెటా యువ వినియోగదారులపై అనేక అధ్యయనాలు చేసిందని ఆయన చెప్పారు. 13 ఏళ్లలోపు పిల్లలకు చెందిన 10 లక్షలకు పైగా ఖాతాలను మెటా నిలిపివేసిందని ష్మిత్ చెప్పారు.
