హైదరాబాద్: బాలికల అక్రమ రవాణా కేసులో హైదరాబాద్ పోక్సో ప్రత్యేక సెషన్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 33 మందిని దోషులుగా నిర్ధారిస్తూ శిక్షలు ఖరారు చేసింది. ఇందులో ఐదుగురికి జీవిత ఖైదు.. మరో 28 మందికి వివిధ శిక్షలు విధించింది. తొమ్మిది మంది బాధిత బాలికలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
కాగా, ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసి బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టారని ఓ మహిళా 2015లో సీఐడీకి ఫిర్యాదు చేసింది. నాలుగు నెలల పాటు వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ బలవంతంగా వ్యభిచారం చేయించారని.. పలువురితో అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని బలవంతం చేశారని పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టింది.
వ్యభిచార గృహాలపై దాడులు చేసి తొమ్మది మంది మైనర్ బాలికలను నిందితుల చెర నుంచి రక్షించారు. ఏ1 నుంచి ఏ45 వరకు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిందితులపై పోక్సో, ఐపీసీ, ఇమ్మోరల్ ట్రాఫిక్, ఎస్టీ, ఎస్టీ అట్రాసిట్ యాక్ట్ కింద కేసులు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం 2026, ఆగస్ట్ 19న హైదరాబాద్ పోక్సో ప్రత్యేక సెషన్ కోర్టు ఈ కేసులో చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.
విచారణలో సీఐడీ మహిళా భద్రత విభాగం బలమైన సాక్ష్యాలు సమర్పించడంతో ఈ కేసులో న్యాయస్థానం మొత్తం 33 మందికి శిక్షలు ఖరారు చేసింది. ఇందులో ఐదుగురికి జీవిత ఖైదు, ముగ్గురికి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 4 మందికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 11 మందికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. నిందితులకు విధించిన జరిమానాను కూడా బాధితులకు పరిహారంగా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
