ఆప్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

ఆప్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

ఢిల్లీ: ఢిల్లీ జల్ బోర్డ్ కుంభకోణం కేసులో ఆప్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్కు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆయనతో పాటు మరో నలుగురు నిందితులకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. బెయిల్ పిటిషన్లపై కోర్టు నోటీసులు జారీ చేసి, ఈ వ్యవహారంపై విచారణను ఆగస్టు 25కి వాయిదా వేసింది.

ఇదే కేసులో.. అంకిత్ శ్రీవాస్తవను రెండు రోజుల పోలీసు కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అప్పగించింది. జైన్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. 2024 మే 10వ తేదీన ఈ FIR నమోదు అయిన తర్వాత, తన క్లయింట్ను 2026 ఆగస్టు 5న ఒకసారి, ఆపై ఆగస్ట్ 18న ఫోన్ కాల్ చేసి విచారణ పేరుతో రెండోసారి పిలిపించి అరెస్టు చేశారని తెలిపారు.

అరెస్టును సమర్థించడానికి ఎటువంటి ఆధారాలు లేవని న్యాయవాది పేర్కొన్నారు. జైన్ తరఫున బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. DJB (ఢిల్లీ జల్ బోర్డ్) మురుగునీటి శుద్ధి కర్మాగారాల విస్తరణ, ఆధునీకరణకు సంబంధించిన టెండరింగ్ ప్రక్రియలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని.. టెండర్ నిబంధనల తారుమారు, కుట్ర జరిగాయనే ఆరోపణలపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2024 మేలో ఈ కేసు నమోదైన సంగతి తెలిసిందే. 

మురుగునీటి శుద్ధి కర్మాగారం (STP) ప్రాజెక్టుల టెండరింగ్ ప్రక్రియలో జరిగిన అవకతవకల ఆరోపణలకు సంబంధించి, ఢిల్లీ ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ (ACB) మంగళవారం మాజీ మంత్రి సత్యేందర్ కుమార్ జైన్, ఢిల్లీ జల్ బోర్డ్ (DJB) మాజీ సీఈఓ ఉదిత్ ప్రకాష్ రాయ్, మరో నలుగురిని అరెస్టు చేసింది. అరెస్టు అయిన ఇతర నిందితులలో డీజేబీ మాజీ కాంట్రాక్టు కన్సల్టెంట్ అంకిత్ శ్రీవాస్తవ, ఏఎన్ ఎంటర్‌ప్రైజెస్ యజమాని నాగేంద్ర యాదవ్, యూరోటెక్ ఎన్విరాన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని రాజా కుమార్ కుర్రా,  శ్రీజన్‌హర్ యజమాని పంకజ్ వర్మ కూడా ఉన్నారు. 

టెండరింగ్ ప్రక్రియలో యూరోటెక్ ఎన్విరాన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుకూలంగా కఠినమైన సాంకేతిక నిర్దేశాలు, నిబంధనలు ఉన్నాయని.. తద్వారా టెండర్లకు పోటీ పడే కంపెనీల మధ్య పోటీని పరిమితం చేసి, ఆ ప్రైవేట్ కంపెనీకి అక్రమ ప్రయోజనం చేకూర్చారని ఏసీబీ గుర్తించిందని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీబీ) విక్రమ్‌జిత్ సింగ్ వెల్లడించారు.