శకటేశ్వరుడు అనే వ్యక్తి ఒక గ్రామంలో ఉండేవాడు. అతను పాచికలు ఆడడు, కానీ మాటలతో మనుషుల మధ్య చిచ్చు పెట్టడంలో ఆరితేరినవాడు. గ్రామంలో వివిధ వ్యక్తుల మధ్య తగాదాలు సృష్టించి తన పబ్బం గడుపుకునేవాడు.
ఆ గ్రామంలో ధర్మయ్య, సత్యయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వాళ్ల ఆస్తిపాస్తుల మీద కన్నేసిన శకటేశ్వరుడు, వారి మధ్య విభేదాలు సృష్టించి ఆస్తిని కాజేయాలని పథకం వేశాడు. మొదట ధర్మయ్య దగ్గరకు వెళ్లి, ‘‘మీ తమ్ముడు సత్యయ్య రహస్యంగా పొలం పత్రాలు మార్చేస్తున్నాడు జాగ్రత్త!’’ అని అబద్ధం చెప్పాడు. అంతటితో ఊరుకోక, సత్యయ్య దగ్గరకు వెళ్లి, ‘‘మీ అన్నయ్య నిన్ను ఇంటి నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నాడు’’ అని నూరిపోశాడు.
శకటేశ్వరుడి మాటలు నమ్మిన అన్నదమ్ములు కొద్దిరోజులు మాట్లాడుకోవడం మానేశారు. ఇది చూసి శకటేశ్వరుడు తన విజయం ఖాయమనుకున్నాడు. కానీ, ఒకరోజు అన్నదమ్ములు ఇద్దరూ అనుకోకుండా ఊరి చివర ఉన్న గుడిలో కలుసుకున్నారు. అప్పుడు ధర్మయ్య నేరుగా తమ్ముడితో.. ‘‘తమ్ముడూ, శకటేశ్వరుడు చెప్పింది నిజమేనా? నువ్వు పొలం పత్రాలు మార్చాలనుకుంటున్నావా? ’’ అని అడిగాడు.
సత్యయ్య ఆశ్చర్యపోయి, ‘‘లేదు అన్నయ్యా! అలాంటి పని నేనెందుకు చేస్తాను? నువ్వే నన్ను ఇంట్లో నుంచి వెళ్లగొడతానన్నావ్ అని చెప్పాడు నాతో..’’ అన్నాడు.
ఆ మాట వినగానే శకటేశ్వరుడు చెప్పిందంతా అబద్ధం అని ధర్మయ్యకు అర్థమైంది. తమ్ముడితో.. ‘‘లేదు తమ్ముడూ, నేనెప్పుడూ ఆ మాట అనలేదు” అన్నాడు. అన్నదమ్ముల మధ్య విభేదాలు తేవాలని ఇలాంటి ఆలోచన చేసినట్టున్నాడు. అందుకే ఒకరి మీద ఒకరికి లేనిపోని చాడీలు చెప్పాడు అనుకున్నారు ఇద్దరూ. అసలు విషయం తెలుసుకున్న అన్నదమ్ములు శకటేశ్వరుడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు.
కొన్ని రోజుల తర్వాత శకటేశ్వరుడు మళ్లీ ధర్మయ్య ఇంటికి వచ్చి, ‘‘సత్యయ్య మీద మరో ఫిర్యాదు చెప్పాల’’ని అనుకున్నాడు. అది చెప్పబోతుండగా అక్కడ సత్యయ్య ప్రత్యక్షమయ్యాడు.
వెంటనే అన్నదమ్ములు ఇద్దరూ అతడిపై గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసి గ్రామ సభకు పిలిపించారు. అందరిముందు అతని అబద్ధాలను బయటపెట్టారు. ఊరి ప్రజలందరూ అతడిని నిలదీశారు. అతను సంపాదించిన అక్రమ ఆస్తిని పేదలకు పంచాలని తీర్పు ఇచ్చారు.
చివరగా, అతను ఎవరి మధ్యనైతే చిచ్చు పెట్టాలని చూశాడో, ఆ అన్నదమ్ములే అతడిని గాడిదమీద కూర్చోబెట్టి ఊరేగించారు. కుతంత్రాలతో ఇతరులను విడదీయాలని చూసేవారికి, పతనం, పరాభవం చాలా వేగంగా ఎదురవుతాయి. నిజాయితీ ముందు ఏ శకుని తంత్రాలు పారవు. ఈ విషయం అర్థమైన శకటేశ్వరుడు తన బుద్ధి మార్చుకుని అందరితో సఖ్యతగా మెలగసాగాడు.
- మొర్రి గోపి
గమనిక: మీరూ లైఫ్‌కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతోపాటు
featureseditor@v6velugu.com కి మెయిల్ చేయండి.
