మాంచెస్టర్: బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ (49), అభిషేక్ శర్మ (43) మెరిసినా.. రెండో టీ20 మ్యాచ్‌లో ఇండియాకు ఓటమి తప్పలేదు. బౌలర్ల వైఫల్యంతో.. శనివారం జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో కంగుతిన్నది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో హోమ్ టీమ్ 1–0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచిన ఇండియా 20 ఓవర్లలో 190/6 స్కోరు చేసింది. తర్వాత ఇంగ్లండ్ 19 ఓవర్లలో 191/6 స్కోరు చేసి నెగ్గింది. జాకబ్ బీథెల్ (76 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
తొలి ఓవర్‌లోనే అర్ష్‌దీప్ (3/40).. ఫిల్ సాల్ట్ (0), బట్లర్ (0)ను డకౌట్ చేసి శుభారంభాన్నిచ్చాడు. 2/1 స్కోరుతో కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను బీథెల్ ఆదుకున్నాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (39)తో మూడో వికెట్‌కు 50, టామ్ బాంటన్ (39)తో నాలుగో వికెట్‌కు 67 రన్స్ జోడించాడు. చివర్లో విల్ జాక్స్ (9), సామ్ కరన్ (7) ఔటైనా, ఆర్చర్ (10 నాటౌట్)తో కలిసి ఈజీగా విజయాన్ని అందించాడు. అర్ష్‌దీప్ 3 వికెట్లు తీసిన ప్రయోజనం దక్కలేదు. బీథెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
వైభవ్ ఫెయిల్..
తొలి రెండు ఓవర్లు స్లోగా ఆడిన వైభవ్ సూర్యవంశీ (14) రెండు సిక్స్‌లతో టచ్‌లోకి వచ్చినా వికెట్ కాపాడుకోలేకపోయాడు. అవతలి వైపు అభిషేక్ శర్మ కూడా బౌండ్రీలతో జోరు పెంచాడు. కానీ ఐదో ఓవర్‌లో వైభవ్ ఔట్‌తో తొలి వికెట్‌కు 50 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఆరో ఓవర్‌లో మూడు ఫోర్లు కొట్టి అభిషేక్ కూడా వెనుదిరిగాడు. పవర్‌ప్లేలో ఇండియా 65/2 స్కోరు చేసింది. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (37) సింగిల్స్‌తో ముందుకెళ్లడంతో ఫస్ట్ టెన్‌లో స్కోరు 96/2గా మారింది.
11వ ఓవర్‌లో రెండు ఫోర్లతో ఇషాన్ జోరు పెంచగా, సిక్స్ కొట్టిన శ్రేయస్ 13వ ఓవర్‌లో వెనుదిరిగాడు. మూడో వికెట్‌కు 65 రన్స్ జతయ్యాయి. ఈ దశలో శివమ్ దూబే (5) ఫెయిలైనా.. తిలక్ వర్మ (24 నాటౌట్) బ్యాట్ ఝుళిపించాడు. 18వ ఓవర్‌లో ఇషాన్ ఔట్ కావడంతో ఇండియా స్కోరు 157/5గా మారింది. కొద్దిసేపటికే అక్షర్ పటేల్ (2), హర్షిత్ రాణా (6) కూడా వెనుదిరిగారు. సామ్ కరన్ 3 వికెట్లు తీశాడు.
