ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌‌‌‌లో 10 అంతస్తుల కొత్త టవర్

ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌‌‌‌లో 10 అంతస్తుల కొత్త టవర్
  •     రవాణా శాఖ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
  •     గచ్చిబౌలి, కూకట్‌‌‌‌పల్లి, పటాన్‌‌‌‌చెరులోనూ కొత్త ఆఫీసులు

హైదరాబాద్, వెలుగు: ఆధునిక భవనాలను నిర్మించేందుకు రవాణా శాఖకు అధికారులు చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఖైరతాబాద్‌‌‌‌లోని ఆర్టీఏ సెంట్రల్ ఆఫీస్ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో దాదాపు 10 అంతస్తుల అత్యాధునిక టవర్‌‌‌‌ను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ప్రధాన భవనం నిజాం కాలం నాటిది కావడంతో వర్షాకాలంలో పరిపాలనాపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కార్యాలయానికి స్థలం సరిపోక, పాత భవనాన్ని ఆనుకొని తాత్కాలిక షెడ్లు వేసి విధులు నిర్వహిస్తున్నారు. 

దీంతో వర్షాలు కురిసినప్పుడు అటు అధికారులకు, ఇటు కార్యాలయానికి వచ్చే ప్రజలకు తీవ్ర అవస్థలు తప్పట్లేదు. గతంలో భారీ వర్షాలు కురిసిన సమయంలో కొన్ని కీలకమైన ఫైళ్లు కూడా తడిసిపోయిన ఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాత భవనాన్ని కూల్చకుండా, పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో  నూతన టవర్ నిర్మించాలని రవాణా శాఖ పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

మరో మూడు కొత్త ఆర్టీఏ ఆఫీసులు

ఈ భవన నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే జేటీసీగా ఇక్కడికి బదిలీపై వచ్చిన ఒక ఉన్నతాధికారికి నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. సెంట్రల్ ఆఫీస్‌‌‌‌తో పాటు నగర పరిధిలో మరో మూడు వైపులా మూడు ఆధునిక భవనాల నిర్మాణానికి కూడా రవాణా శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గచ్చిబౌలి, పటాన్‌‌‌‌చెరు, కూకట్‌‌‌‌పల్లి ప్రాంతాల్లో కొత్త ఆర్టీఏ భవనాల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. వీటికి సంబంధించిన ఆర్థిక అనుమతులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది.