బాలాలయంలోకి సరస్వతీ అమ్మవారు..జులై5 నుంచి గర్భగుడిలోకి భక్తులకు ప్రవేశం నిలిపివేత

బాలాలయంలోకి సరస్వతీ అమ్మవారు..జులై5  నుంచి గర్భగుడిలోకి భక్తులకు ప్రవేశం నిలిపివేత
  • పునర్నిర్మాణం పూర్తయ్యేంత వరకు బాలాలయంలోనే పూజలు

నిర్మల్, వెలుగు: నిర్మల్​ జిల్లా బాసర సరస్వతీ దేవి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా భక్తులకు గర్భగుడిలో దర్శనం, పూజలను నిలిపివేయనున్నారు. ఆదివారం నుంచి బాలాలయంలో భక్తులకు దర్శనం, అక్షరాభ్యాసం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయం పునర్నిర్మాణ పనులన్నీ పూర్తయ్యేంత వరకు భక్తులు బాలాలయంలోనే పూజలు చేయనున్నారు. 

ఇందులో భాగంగా శనివారం గురు ప్రార్థన, గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, రుత్విగ్వరణ, నవగ్రహ, బ్రహ్మ కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ పూర్తి చేశారు. ఆదివారం శృంగేరి పీఠాధిపతులు అందించిన దేవతామూర్తులకు ప్రధాన ఆలయంలో సంకల్పం, గణపతి పూజ తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను బాలాలయంలో ప్రతిష్ఠించనున్నారు. 

ప్రధాన ఆలయంలో జరిగే నిత్య పూజలు బాలాలయంలో ప్రతిష్ఠించే ఉత్సవమూర్తులకు సైతం నిర్వహించనున్నారు. ఆలయ ఈవో అంజనీదేవి, ఏఈవో శ్రీనివాస్, స్థానాచార్యులు ప్రవీణ్  పాఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్  పాఠక్  బాలాలయంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఉన్నతాధికారుల సమీక్ష

బాసర ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభించనుండగా, శనివారం రాష్ట్ర స్థాయి అధికారులు సమీక్ష జరిపారు. ఆర్అండ్ బీ ఈఎన్సీ వసంత్ నాయక్, స్తపతి మోతీలాల్, ఆర్కిటెక్​ మాధవీలత, ఈవో అంజనీ దేవి, ఇంజనీర్లు అభివృద్ధి పనులు చేపట్టే స్థలాలను పరిశీలించారు. ఆలయ గర్భాలయ పరిసరాలు, బాలాలయాన్ని పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూలైన్, అక్షరాభ్యాస మండపం నిర్మాణం, తదితర అంశాలను వారు రివ్యూ చేశారు.