ఓసీపీలపై సింగరేణి నజర్..వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడకుండా చర్యలు

ఓసీపీలపై సింగరేణి నజర్..వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడకుండా చర్యలు
  • క్వారీలో నిలిచిన వరదనీళ్లు తోడేందుకు అదనంగా భారీ మోటారు పంపులు
  • హాలేజీ రోడ్లపై గ్రేడింగ్ చేసేలా చర్యలు
  • అన్ని ఏరియాలకు ఆదేశాలు జారీ చేసిన సీఎండీ

కోల్​బెల్ట్, వెలుగు: వర్షాకాలం నేపథ్యంలో ఓపెన్​కాస్ట్  గనుల్లో బొగ్గు ఉత్పత్తి, రవాణాకు అంతరాయం కలగకుండా సింగరేణి యాజమాన్యం ముందస్తు చర్యలు చేపట్టింది. సింగరేణిలో ఓసీపీల ద్వారా 80 శాతానికి పైగా బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఏటా వర్షాలతో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుండగా, ఈ సమస్యను అధిగమించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని యాజమాన్యం అన్ని ఏరియాలకు ఆదేశాలు జారీ చేసింది. 

సీఎండీ బుద్ధప్రకాశ్​ జ్యోతి ఇటీవల డైరెక్టర్లు, ఏరియా జీఎంలతో ఈ అంశంపై రెండు సార్లు రివ్యూ చేశారు. భారీ వర్షాలు కురిసినా ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భారీ యంత్రాలు నడిచే హాలేజీ రోడ్లు, బొగ్గు వెలికి సే కోల్​బెంచ్​ క్వారీ, మట్టిని వెలికితీసే ఓబీ క్వారీల్లో నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలని ఆదేశించారు. అన్ని ఏరియాల్లో సింగరేణి డైరెక్టర్లు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. కొన్ని ఏరియాల్లో సీఎండీ సైతం పర్యటించారు.

ఓసీపీల నుంచే 80 శాతం బొగ్గు ఉత్పత్తి

సింగరేణిలో 21 అండర్ గ్రౌండ్​ మైన్లు,17 ఓపెన్​కాస్ట్​ మైన్ల ద్వారా బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 58 మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని టార్గెట్​గా నిర్దేశించింది. రోజుకు 1,49,796 టన్నులకు గాను, 1,29,441 టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. ఇందులో 17 ఓపెన్​కాస్ట్​ మైన్ల ద్వారా 1,32,896 టన్నులకు గాను, 1,17,138 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. అండర్​ గ్రౌండ్​ మైన్ల ద్వారా రోజుకు 16,900 టన్నులు ప్రొడక్షన్​ జరుగుతోంది.  ప్రతి రోజు దేశంలోని వివిధ విద్యుత్​ ప్లాంట్​లకు 60 వేల నుంచి 70 వేల టన్నుల బొగ్గు సప్లై చేస్తోంది.

ఉత్పత్తికి అంతరాయం లేకుండా..

ఓసీపీల్లో భారీ వర్షాలు కురిసినా ఒక షిఫ్ట్​ కన్నా ఎక్కువ ఉత్పత్తి నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు యాజమాన్యం సూచించింది. ప్రతి ఏటా వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా ఇబ్బందిగా మారుతోంది. రోజుల తరబడి వర్షాలు పడితే రోడ్లన్నీ బురదమయంగా మారుతున్నాయి. దీంతో గనుల నుంచి బొగ్గు వెలికి తీయడం, బొగ్గును రవాణా చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. 

వర్షాల కారణంగా ఉత్పత్తి నిలిచిపోవడంతో టార్గెట్​ చేరుకునేందుకు చివర్లో ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈక్రమంలో ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగకుండా భారీ యంత్రాలు నడిచే క్వారీ హాలేజ్(ఓసీపీ ప్రధాన రోడ్లు)రోడ్లపై వరద నీరు నిల్వ ఉండకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. వర్షం కురిసి తగ్గిన వెంటనే రోడ్లపై భారీ వాహనాలు తిరిగేలా ముందుస్తు చర్యలు తీసుకుంటున్నారు.

అదనపు మోటార్లు ఏర్పాటు..

భారీ వర్షాలతో ఓసీపీ క్వారీల్లో నీటి నిల్వలు పెరిగి యంత్రాలు మునిగిపోయిన ఘటనలు ఉన్నాయి. ఈక్రమంలో ఓసీపీల్లో నీటి నిల్వలు పెరగకుండా హై కెపాసిటీ పంపులు ఏర్పాటు చేశారు. క్వారీల్లో చేరిన నీటిని ఎప్పటికప్పుడు పంపింగ్​ చేసేలా 350 హెచ్​పీ మోటార్లను వినియోగిస్తున్నారు. సబ్​ మెర్సిబుల్​ పంపుల ద్వారా నీటిని తోడేలా చర్యలు తీసుకుంటున్నారు. 17 ఓసీపీల్లో నీటిని తోడేందుకు 100 మోటార్​ పంపులు పని చేస్తున్నాయి. 

వర్షం వస్తే అదనంగా మరో 50 మోటార్​ పంపులను వినియోగించుకొనేందుకు సిద్ధంగా ఉంచారు. క్వారీల్లోని సంపుల్లో నీటిని తోడేందుకు వినియోగిస్తున్న మోటార్లు మునిగిపోకుండా ఫ్లోటింగ్​ ప్లాట్​ఫాంలు సైతం నిర్మించారు. ఓసీపీల పక్కనే ఉన్న వాగులు, కాల్వలు, ఒర్రెల నుంచి నీటి ప్రవాహం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మరోవైపు డంప్​ యార్డుల్లో బొగ్గు నిలువ చేయకుండా రవాణా చేయడంపై యాజమాన్యం దృష్టి సారించింది.