సీడ్ కంపెనీల ఇష్టారాజ్యం.. అమాంతంగా రేట్లు పెంచిన కంపెనీలు

సీడ్ కంపెనీల ఇష్టారాజ్యం..  అమాంతంగా రేట్లు పెంచిన కంపెనీలు
  •      ఏడు వెరైటీలకే బోనస్​ ప్రకటనతో సన్నాలకు డిమాండ    
  •     10 కిలోల బ్యాగుపై రూ.150 నుంచి- 200 వరకు బాదుడు
  •     సర్కారు కంట్రోల్​ లేకపోవడంతో నష్టపోతున్న రైతులు 

మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఏడు రకాల సన్నాలకు మాత్రమే బోనస్  చెల్లిస్తామని ప్రకటించడంతో ఆ విత్తనాలకు మార్కెట్​లో ఒక్కసారిగా డిమాండ్​ పెరిగింది. ఇదే అదునుగా సీడ్​ కంపెనీలు సదరు వెరైటీల రేట్లను అమాంతం పెంచేశాయి. దీనికి ఇటీవల ఇంధన ధరలతో పాటు ఆ మేరకు ట్రాన్స్​పోర్టు చార్జీలు పెరగడాన్ని సాకుగా చూపుతున్నాయి. పత్తి విత్తనాల మాదిరిగా వరి విత్తనాలపై సర్కారు కంట్రోల్​ లేకపోవడంతో సీడ్​ కంపెనీలు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచి రైతులను దోచుకుంటున్నాయి. 

ఒక్కో బ్యాగుపై రూ.200 వరకు హైక్

విత్తన కంపెనీలు ఒక్కో బ్యాగుపై రూ.150 నుంచి రూ.200 వరకు పెంచడంతో రైతులపై భారం పడుతోంది. సన్న ధాన్యం సీడ్​ 10 కిలోల బ్యాగును గత ఏడాది రూ.900కు అమ్మగా, అదే బ్యాగును ఇప్పుడు రూ.1,050 నుంచి రూ.1,100 వరకు విక్రయిస్తున్నారు. మార్కెట్​లో అధిక డిమాండ్​ ఉన్న ఓ కంపెనీ వెరైటీ10 కేజీలకు ఎమ్మార్పీ రూ.1,510 ఉండగా, డీలర్లు రైతులకు రూ.1,200 నుంచి రూ.1,250 వరకు అమ్ముతున్నారు. 

మార్కెట్​లో పోటీ కారణంగా కొందరు వ్యాపారులు రూ.50 నుంచి రూ.100 వరకు రేటు తగ్గించి అమ్ముతామంటే అందుకు కంపెనీ ఒప్పుకోవడం లేదని, రూ.1,200 కంటే తక్కువ రేటుకు విక్రయించడానికి  వీల్లేదంటూ డీలర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. ఇదే సీడ్​ను నిరుడు రూ.950 నుంచి రూ.వెయ్యి లోపు అమ్మినట్లు డీలర్లు చెబుతున్నారు. ఇలా కంపెనీలు ఒక్కసారిగా రేట్లు హైక్​ చేయడంతో రైతులు నష్టపోతున్నారు. 

జైశ్రీరామ్, తెలంగాణ సోనకు డిమాండ్

ప్రభుత్వం సూచించిన వాటిలో బీపీటీ-–5204, ఆర్ఎన్ఆర్–​-15048, హెచ్ఎంటీ -సోన, జైశ్రీరామ్, కేఎన్ఎం–1638, కేఎన్ఎం–7715, డబ్ల్యూజీఎల్–-44 వెరైటీలు ఉన్నాయి. అయితే రైతులు ఎక్కువగా జైశ్రీరామ్​, తెలంగాణ సోన వంటి రకాలకు మొగ్గు చూపుతున్నారు. సన్నాలకు చీడపీడలు ఎక్కువగా ఆశించే అవకాశాలు ఉండడంతో దిగుబడి తగ్గి పెట్టుబడి ఎక్కువ అవుతుందనే భయం ఉన్నప్పటికీ అనివార్యంగా సాగుకు సిద్ధమవుతున్నారు.

 బీపీటీ పంట కాలం 150 రోజులు కాగా, జైశ్రీరామ్​ 130 రోజులు, తెలంగాణ సోన 110 నుంచి 120 రోజులు మాత్రమే. పై రెండు వెరైటీల పంట కాలం తక్కువ కావడంతో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అలాగే ఈ ఏడాది ఎల్​నినో ఎఫెక్ట్​తో వర్షాలు సాధారణ స్థాయి కంటే తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడం తెలిసిందే. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులు స్వల్పకాలిక రకాలకే ఇంట్రెస్ట్​ చూపుతున్నారు. అలాగే మార్కెట్​లో జైశ్రీరామ్, తెలంగాణ సోన వంటి రకాలకు మంచి డిమాండ్​ ఉంది. వ్యాపారులు, మిల్లర్లు నిరుడు పోటాపోటీగా ఈ వెరైటీలను కొనుగోలు చేశారు. క్వింటాల్​కు రూ.3 వేల నుంచి రూ.3,200 వరకు చెల్లించారు. దీంతో రైతులు పండించిన పంటలో కొంత తిండికి దాచుకోగా, మిగిలిన వడ్లను మార్కెట్​లో అమ్ముకున్నా గిట్టుబాటు అవుతుందని 
భావిస్తున్నారు.

జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో సాగు 

వానాకాలం సీజన్​లో మంచిర్యాల జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో వరి పంట సాగువుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం ఏడు రకాలకు మాత్రమే బోనస్​ ప్రకటించడంతో ఈసారి దాదాపు 90 శాతం దాకా సన్నాలు వేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇందుకు అవసరమైన విత్తనాలు డీలర్ల దగ్గర అందుబాటులో ఉన్నాయని అంటున్నారు.

 సన్నాలను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం గత నెల 23 నుంచి 30 వరకు రైతు వేదికల్లో సీడ్​ మేళాలను ఏర్పాటు చేసి ప్రైవేట్​ డీలర్ల ద్వారా విత్తనాలను విక్రయించారు. కానీ, ఈ మేళాలకు రైతుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. గతంలో మాదిరిగానే డీలర్ల దగ్గరికే వెళ్లి విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో సాగు విస్తీర్ణానికి అవసరమైన విత్తనాలు డీలర్ల దగ్గర అందుబాటులో ఉన్నాయని డీఏవో సురేఖ తెలిపారు.