నా సవాల్‌‌‌‌‌‌‌‌కు కేసీఆర్, కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హరీశ్‌‌‌‌‌‌‌‌ స్పందించలే : మంత్రి జూపల్లి

నా సవాల్‌‌‌‌‌‌‌‌కు కేసీఆర్, కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హరీశ్‌‌‌‌‌‌‌‌ స్పందించలే : మంత్రి జూపల్లి
  • నేను ఉదయం సవాల్​చేసి.. సాయంత్రం ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన: మంత్రి జూపల్లి
  •     బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు మాత్రం పత్తాలేరు 
  •     కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హయాంలో రాష్ట్ర అప్పు రూ.8 లక్షల కోట్లు
  •     అది నిజం కాకపోతే వారు నిరూపించాలని వ్యాఖ్య 

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ హయాంలో చేసిన రాష్ట్ర అప్పులపై చర్చించేందుకు తాను విసిరిన సవాల్‌‌‌‌‌‌‌‌కు కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు స్పందించలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఉదయం తాను సవాల్‌‌‌‌‌‌‌‌ చేసినట్లుగానే సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్​క్లబ్‌‌‌‌‌‌‌‌కు వచ్చానని.. బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు మాత్రం పత్తాలేరని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి మీడియాతో జూపల్లి మాట్లాడారు. ‘రాష్ట్ర అప్పులపై నేను శుక్రవారం ఉదయం 4 పేజీల లేఖను కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌‌‌‌‌‌‌‌కు వాట్సాప్, ఈ మెయిల్, స్పీడ్ పోస్టులో పంపిన.. నా లేఖకు సమాధానం చెప్పిన అని హరీశ్ అంటుండు.. కానీ, అందులో అసలు సమాధానం లేదు. 

నేను చెప్పినట్టు కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హయాంలో రాష్ట్ర అప్పు రూ.8 లక్షల కోట్లు. అది నిజం కాకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పాను. ఇది నిజం కాదని వారు రుజువు చేయాలి. లేదంటే వారు తమ పదవులకు రాజీనామా చేస్తారా? బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ను కేసీఆర్ రద్దు చేస్తరా’ అని ఆ లేఖలో వారికి సవాల్ విసిరానని మంత్రి స్పష్టం చేశారు. ఈ సవాల్‌‌‌‌‌‌‌‌కు రాతపూర్వకంగా గానీ, స్వయంగా ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌కు చర్చకు రావాలని ముగ్గురునీ కోరినట్టు చెప్పారు. కానీ, హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు ఒక్కరే లెటర్ రాశానని అంటున్నడని, ఆ లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అసలు విషయం లేదని, అంతా సొల్లు పురాణం ఉందని విమర్శించారు.

బావా బామ్మర్దులకు మొఖం చెల్లలేదు

బావా బామ్మర్దులకు ముఖం చెల్లలేదని, అందుకే తన సవాల్‌‌‌‌‌‌‌‌కు ముందుకు రాలేదని కేటీఆర్, హరీశ్‌‌‌‌‌‌‌‌ రావుపై జూపల్లి మండిపడ్డారు. ‘నిజం చెప్పేందుకు ధైర్యం ఉండాలి. మీ మాట నిజమైతే నాలా రాజీనామా చేస్తా అని చెప్పే ధైర్యం మీలో ఎందుకు లేదు? బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ లీడర్లు వాస్తవాలను పక్కనపెట్టి, రూ.కోట్లు ఖర్చు చేస్తూ సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలాగూ అసెంబ్లీకి రారు. కనీసం ప్రెస్ మీట్ పెట్టి అయినా వాస్తవాలు చెప్పాలి. 

అలా చెప్పేందుకు కేసీఆర్ నోటి ముత్యాలు ఏమీ రాలవు. కాళేశ్వరం, పాలమూరు కోసం అప్పులు తెస్తే.. వాటిని రైతులతో కట్టిస్తారా? మిషన్ భగీరథ పేరుతో తెచ్చిన అప్పులు.. ఆ నీళ్లు తాగున్న ప్రజలు చెల్లించాలా? మిస్టర్ కేటీఆర్, హరీశ్.. పాలమూరు పౌరుషం, చీము, నెత్తురు ఉండబట్టే ఆనాడు మంత్రి పదవికి రాజీనామా చేశాను. నేను రాజీనామా చేశాకే అప్పుడు మహబూబ్​నగర్ జిల్లాలో బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు 6 సీట్లు వచ్చాయి. నా రాజీనామా ప్రభావం అప్పుడు రాష్ట్రమంతా పడింది’ అని జూపల్లి గుర్తుచేశారు. అమరవీరుల స్థూపం వద్దకు వస్తానని హరీశ్ అన్నందుకే, గురువారం తాను అక్కడకు వెళ్లానని, తెలంగాణ భవన్​కు రాలేదనే వంకతో తనను విమర్శిస్తున్నారన్నారు. తాను అబద్ధాలు చెప్పనని, తన ఆత్మగౌరవాన్ని ఎవరూ ప్రశ్నించలేరన్నారు. అడ్డగోలు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని కేటీఆర్, హరీశ్‌‌‌‌‌‌‌‌పై మండిపడ్డారు. పదేండ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పాలన సరిగ్గా ఉంటే.. ప్రస్తుతం ఆ పార్టీకి ఈ దుస్థితి ఎందుకు వచ్చేదని ప్రశ్నించారు.