- మిడ్జిల్ మండల జడ్పీటీసీగా ఎన్నికై 20 ఏండ్లయిన సందర్భంగా పర్యటన
- అంబేద్కర్, ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ
- మిడ్జిల్, ఊర్కొండ మండలాల అభివృద్ధికి
- రూ.350 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన
- అనంతరం గ్రామ శివారులో బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం
- సభా ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
మహబూబ్‌నగర్/ మిడ్జిల్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి శనివారం పాలమూరులో పర్యటించనున్నారు. 2006 జులై 4న మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల జడ్పీటీసీగా రేవంత్ రెడ్డి ఎన్నికై 20 ఏండ్లు కావొస్తోన్న సందర్భంగా సీఎం హోదాలో ఆయన మిడ్జిల్‌కు రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 11.40 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లోబయలుదేరి, మధ్యాహ్నం 12.25 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఊర్కొండకు చేరుకుంటారు.
అక్కడ అంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం, ఆలయంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. ఆలయ ఆవరణలో గ్రామస్తులతో కలిసి లంచ్ చేస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రానికి చేరుకొని బీఆర్ అంబేద్కర్, ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. మిడ్జిల్, ఊర్కొండ మండలాలకు సంబంధించి దాదాపు రూ.350 కోట్ల అభివృద్ధి పనులకు పర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు మిడ్జిల్ వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడతారు.
కాగా, సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్లను జోగుళాంబ జోన్డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, మహబూబ్‌నగర్ ఎస్పీ డి.జానకి పరిశీలించారు. సభా ప్రాంగణం, హెలీప్యాడ్, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ నియంత్రణ, ఇతర బందోబస్తు గురించి ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 1,605 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉంటారని అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం మహబూబ్‌నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా కూడా సీఎం సభా ఏర్పాట్లను పరిశీలించారు.
