నిరుద్యోగులకు సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్యాయం : కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నిరుద్యోగులకు సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్యాయం :  కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్​ఇవ్వాలని సీఎంకు కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేఖ

హైదరాబాద్, వెలుగు: నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ఉద్యమ నినాదమని, కానీ, నియామకాల విషయంలో కొన్ని రోజులుగా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పోలీసు పోస్టులను పెంచాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా పెడచెవిన పెట్టడం మంచిదికాదన్నారు. 5 వేల పోలీస్ పోస్టులకే నోటిఫికేషన్ ఇస్తామనడం సరికాదని, వెంటనే 20 వేల పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల నోటిఫికేషన్ల విషయంలో యువతను ప్రభుత్వం వంచించిందని విమర్శించారు. ‘‘పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలకు పోటీపడే యువతలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవాళ్లే ఉంటారు. 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు వచ్చి ఏండ్ల తరబడి రేయింబవళ్లు కష్టపడి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. అలాంటి పేద యువత ఆశల మీద నీళ్లు చల్లకుండా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రాష్ట్రంలో సుమారు 17 వేల పోలీసు పోస్టులు ఖాళీ ఉన్నాయని ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. స్వయంగా మీరే 12 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి, వాటిని భర్తీ చేస్తామని పలుమార్లు హామీ ఇచ్చారు. కానీ, కేవలం 5 వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులను నిరాశలోకి నెట్టేసింది’’అని ఆయన లేఖలో పేర్కొన్నారు. రెండున్నరేండ్లలో కేవలం 17 వేల కొత్త ఉద్యోగాలనే కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసిందని ఆరోపించారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో భర్తీ చేసిన 50 వేల పైచిలుకు ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించి, క్రెడిట్ తీసుకోవాలని చూశారని విమర్శించారు. 

సర్ కోసం బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ కమిటీ..

రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఎన్నికల జాబితా సవరణ (సర్​) కార్యక్రమంలో పార్టీ తరఫున బీఎల్‌‌‌‌‌‌‌‌ఏలను సమన్వయం చేయడం కోసం ప్రత్యేక సమన్వయ, పర్యవేక్షణ కమిటీని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఎమ్మెల్సీలు ఎల్.రమణ, శ్రవణ్ దాసోజు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ జనరల్ సెక్రటరీ భరత్ కుమార్ సోమా, మాజీ చైర్మన్లు మన్నె క్రిశాంక్, వై.సతీశ్ రెడ్డి, పార్టీ నేతలు ముజీబుద్దీన్, సుమిత్ర ఆనంద్, అభిలాష్ రావు  రంగినేనిను సభ్యులుగా నియమించారు.