- రాష్ట్రానికి భారమనుకుంటే ప్రధానితో మాట్లాడి ఒప్పించండి: బండి సంజయ్
- బిగ్‌బాస్ షోను తలపిస్తోన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు
- సింగరేణి బొగ్గు మాయంపై విచారణ చేసే దమ్ము లేదా అని ప్రశ్న
కరీంనగర్, వెలుగు: వీబీజీ రామ్‌జీ పథకంతో పేదలకు మేలు జరుగుతుందని, గ్రామాల్లో ఆస్తులను సృష్టించవచ్చని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ పథకాన్ని అమలు చేస్తే కేంద్రానికి మంచి పేరొస్తుందన్న అక్కసుతోనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలనే నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఈ స్కీం వల్ల రాష్ట్రంపై భారం పడుతుంది అనుకుంటే ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలేగానీ కోర్టు ద్వారా అడ్డుకోవాలి అనుకోవడం దారుణమన్నారు. బండి సంజయ్ కరీంనగర్‌లో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు, టీచర్లకు బ్రేక్‌ఫాస్ట్, పాలు, లంచ్ సౌకర్యం కల్పించడాన్ని ఆయన స్వాగతించారు. ఇటు బ్రేక్‌ఫాస్ట్ సౌకర్యం కల్పిస్తూ అటు రాష్ట్రంలో 10 వేల స్కూళ్లను మూసివేసేందుకు చర్యలు తీసుకోవడమేంటని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరగడం వల్లనే ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుండడాన్ని ఓర్వలేక కాంగ్రెస్ , బీఆర్ఎస్ నేతలు కుమ్మక్కై బిగ్‌బాస్ షోను తలపించేలా డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. సింగరేణిలో బొగ్గు మాయంపై విచారణ జరిపించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చేతగాకపోతే కేంద్రాన్ని కోరితే విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. యూసీఎఫ్ నిధులపై మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. దేశవ్యాప్తంగా 17 ప్రాజెక్టులకు మాత్రమే యూసీఎఫ్ ఫండ్ ఇస్తే... అందులో కరీంనగర్ ఉందనే విషయం మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. పొన్నంకు చిత్తశుద్ధి ఉంటే... కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వం నిధులెందుకు ఇవ్వడం లేదన్నారు.
