- మేము నిరూపిస్తే కేటీఆర్, హరీశ్ రావు రాజీనామా చేస్తారా ?
- పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ద్వారా ఒక్క ఎకరానికైనా నీరిచ్చారా ?
- ఇచ్చినట్లు నిరూపిస్తే మేం రాజీనామా చేస్తం : ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్ రెడ్డి
నాగర్ కర్నూల్ టౌన్/లింగాల, వెలుగు : బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలు నిజమేనని, వాటిని ఆధారాలతో నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి సవాల్ చేశారు. నాగర్‌కర్నూల్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
రూ. 8 లక్షల కోట్ల అప్పు ఆరోపణలను తాము నిరూపిస్తే కేటీఆర్, హరీశ్‌రావు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేయలేని పనులను కాంగ్రెస్ చేసి చూపిందని, ఆరు గ్యారంటీల్లో రెండింటిని మినహాయించి మిగిలిన హామీలన్నింటినీ అమలు చేశామని స్పష్టం చేశారు.
నిర్మాణాత్మక సూచనలు చేయాల్సింది పోయి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించకుండా బీజేపీ లీడర్లు మాట్లాడడం హాస్పాస్పదంగా ఉందన్నారు. పదేండ్ల బీఆర్ ఎస్ పాలనలో పాలమూరు జిల్లాలో జరిగిన అభివృద్ధి ఏమిటో చెప్పాలన్నారు. కేసీఆర్ హయాంలోనే కృష్ణా జలాల దోపిడీ జరిగిందని ఆరోపించారు.
పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఒక్క ఎకరానికైనా నీరు అందించామని నిరూపిస్తే తాము రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సునేంద్ర పాల్గొన్నారు. అనంతరం మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ కలిసి లింగాలలో గ్రామ పంచాయతీ కాంప్లెక్స్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
