- రామడుగు మెగా ఇండస్ట్రీస్‌లో అక్రమాలు
- నిరంతర దాడులతోనే కల్తీ నియంత్రణ
కరీంనగర్, వెలుగు: పశువులకు దాణాగా వినియోగించాల్సిన గోధుమ తవుడుతో.. మనుషులు తినే మీల్మేకర్ తయారు చేస్తుండడం జిల్లాలో ఆందోళన కలిగిస్తోంది. ప్రొటీన్ ఫుడ్ కదా అని తీసుకుంటే.. జనం ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ఇటీవల కరీంనగర్ సిటీలో కల్తీ కారం, కల్తీ దనియాల పొడి పట్టుబడిన ఘటన మరవకముందే తాజాగా రామడుగు మండలం దేశరాజ్ పల్లిలో కల్తీ మీల్మేకర్తోపాటు తయారీకి ఉపయోగించే గోధుమ తవుడు బస్తాలకొద్దీ లభించడం కలకలం రేపుతోంది.
సోయా పిండికి బదులు గోధుమ తవుడు
సాధారణంగా సోయాబీన్ నుంచి నూనె తీసివేయగా మిగిలిన సోయా పిండి నుంచి మీల్‌మేకర్‌ను తయారు చేస్తారు. తొలుత సోయా పిండిని నీటితో కలిపి ఆవిరితో ఉడికించి, ప్రత్యేక యంత్రాల సాయంతో ముక్కలుగా కత్తిరించి ఎండబెడుతారు. దీంతో అవి స్పాంజిలాంటి మీల్మేకర్(సోయా చంక్స్) తయారవుతాయి. హై ప్రొటీన్ ఫుడ్ అనే ఉద్దేశంతో చాలా మంది మీల్‌మేకర్‌ను తినేందుకు ఇష్టపడుతుంటారు.
అందుకే వీటికి ఉన్న డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు రామడుగు మండలం దేశరాజ్ పల్లికి చెందిన మెగా ఇండస్ట్రీస్ ఓనర్ సోయా పిండికి బదులుగా గోధుమల పొట్టు నుంచి తీసిన తవుడును వినియోగించి వీఎస్ బ్రాండ్ పేరుతో మీల్మేకర్ తయారు చేస్తున్నట్లు కరీంనగర్ ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. బుధవారం నిర్వహించిన దాడుల్లో ఏడున్నర క్వింటాళ్ల సోయా చంక్స్ తో పాటు 1600 కిలోల గోధుమ తవుడును సీజ్ చేశారు.
రాష్ట్రంలో నాలుగైదు ఉమ్మడి జిల్లాలకు ఇక్కడి నుంచే మీల్మేకర్ సప్లై అవుతుంటాయని, వీటిని తింటే అనారోగ్యం బారిన పడాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) లైసెన్స్ తీసుకుని మరీ మెగా ఇండస్ట్రీస్ నిర్వాహకులు కల్తీ ఫుడ్ తయారు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ఉందనే నమ్మకంతో ప్రజలు కొనుగోలు చేసి తింటారని, ఇలాంటి సంస్థల లైసెన్స్ క్యాన్సిల్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.
నిరంతర దాడులతోనే కల్తీ నియంత్రణ
కరీంనగర్ జిల్లాలో కల్తీ, నాణ్యత లేని ఆహార పదార్థాలు, సరుకుల తయారీ తరచూ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో చిక్కుతున్నాయి. నిరుడు అక్టోబర్ నుంచి జూన్ 30 వరకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కరీంనగర్ జిల్లాలో హోటళ్లు, విద్యాసంస్థలు, బేకరీలు, స్వీట్ హౌస్‌లు, నిత్యావసరాల తయారీపై సుమారు 340కి పైగా ఆకస్మిక దాడులు చేశారు. ఇందులో 105 వరకు శాంపిళ్లు సేకరించి ల్యాబ్‌కు పంపగా.. 18 శాంపిళ్లలో పూర్తిగా నాణ్యత లోపించినట్లు గుర్తించారు. ఈ కేసులపై అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి విచారణ జరిపి బాధ్యులైన 13 మందికి రూ.5.25 లక్షలు ఫైన్ వేశారు. మరో ఐదుగురిపైనా కేసులు నమోదు చేసి ఫైన్ వేయనున్నట్లు ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ అంకిత్ రెడ్డి వెల్లడించారు.
నకిలీ ఫుడ్ ఇన్ స్పెక్టర్లతో జాగ్రత్తజిల్లాలో కొంతమంది నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్లుగా ఫోన్లలో పరిచయం చేసుకుంటూ ఆహార వ్యాపార సంస్థల యజమానులను డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అలాంటివారి మాటలు నమ్మి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే కరీంనగర్ జిల్లా ఫుడ్ సేఫ్ట్ ఆఫీస్‌లో సంప్రదించాలి. లేదా 9100105795 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.- రోహిత్ రెడ్డి, ఫుడ్ సేఫ్టీ ఇన్ స్పెక్టర్, కరీంనగర్
