మీ-సేవల్లో అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు : నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్

మీ-సేవల్లో అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు : నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్గొండ, వెలుగు :   మీ-సేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన యూజర్ చార్జీలకే సేవలు అందించాలని, ప్రజల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ మీ-సేవ కేంద్రాల ఆపరేటర్లను హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్​లో జిల్లాలోని మీ-సేవ కేంద్రాల యజమానులు, ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన యూజర్ చార్జీలకే సేవలు అందించాలన్నారు.

కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనందున సర్టిఫికెట్ల కోసం వచ్చే విద్యార్థుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడవద్దని, వివరాల నమోదులో ఎలాంటి  పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారిని ప్రపంచ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దాలని సూచించారు.

అంగన్‌‌‌‌వాడీల్లో ఐదేండ్లు నిండిన పిల్లలను సమీప బడుల్లో చేర్పించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు ఒలింపియాడ్, ఇతర పోటీ పరీక్షల్లో వారు విజయం సాధించేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని టీచర్లకు సూచించారు.