న్యూఢిల్లీ, వెలుగు: అర్హుల పేర్లు మాత్రమే ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియ చేపడుతున్నట్లు భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం విడుదల చేసే సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంతో పాటు తప్పుడు ప్రచారం, అపోహలు, దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత కమ్యూనికేషన్ అధికారులపై ఉందన్నారు. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, పారదర్శక ఎన్నికల నిర్వహణలో మీడియా, ప్రజా సంబంధాల అధికారుల పాత్ర అత్యంత కీలకమని గుర్తు చేశారు.
శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో మీడియా & కమ్యూనికేషన్ నోడల్ అధికారుల జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మీడియా అకాడమీ జాయింట్ కమిషనర్ యు. వెంకటేశ్వర్లు, కమిషనరేట్ పౌర సంబంధాల అధికారులు ఎం. కిరణ్మయి, ఏ. వనజతో పాటు రాష్ట్రానికి చెందిన జిల్లా ప్రజా సంబంధాల అధికారులు, సోషల్ మీడియా నోడల్ అధికారులు పాల్గొన్నారు.
