కర్ణాటకలో గిగ్ ఎకానమీ భవిష్యత్తుపై కీలక మలుపు చోటుచేసుకుంది. లక్షలాది మంది ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్ డెలివరీ భాగస్వాముల జీవితాలకు భరోసా కల్పించే దిశగా రూపొందించిన గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ చట్టం అమలుపై తీవ్ర వివాదం నడుస్తున్న వేళ.. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తాజా మధ్యంతర ఉత్తర్వు అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకవైపు జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో వంటి దిగ్గజ సంస్థల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటూనే.. మరోవైపు గిగ్ వర్కర్ల సంక్షేమానికి ఎలాంటి ఆటంకం కలగకుండా సమతుల్య వైఖరిని కోర్టు ప్రదర్శించడం ఈ కేసులో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది.
జస్టిస్ ఎం. నాగప్రసన్న విచారణ సందర్భంగా చట్టం అమలుపై తక్షణ స్టే ఇవ్వడానికి నిరాకరించారు. అయితే ప్లాట్‌ఫారమ్ కంపెనీలు రెండో త్రైమాసికానికి సంబంధించిన వెల్ఫేర్ ఫీజును ప్రభుత్వానికి కాకుండా హైకోర్టు రిజిస్ట్రీలో 3 వారాల్లో జమ చేయాలని ఆదేశించారు. దీంతో నిధులు సురక్షితంగా ఉంటూనే.. తుది తీర్పు వచ్చే వరకు ఏ పక్షానికీ అన్యాయం జరగకుండా కోర్టు జాగ్రత్త పడింది. అలాగే కోర్టు ఆదేశాలను పాటించినంతకాలం కంపెనీలపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో పాటు పలువురు అగ్రిగేటర్లు దాఖలు చేసిన పిటిషన్లలో.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సోషల్ సెక్యూరిటీ కోడ్–2020 ఇప్పటికే ఇదే అంశాన్ని కవర్ చేస్తోందని, అందువల్ల రాష్ట్ర చట్టం రాజ్యాంగంలోని ఆర్టికల్ 254 ప్రకారం చెల్లదని వాదించారు. వెల్ఫేర్ ఫీజు తమ లాభనష్టాలపై ప్రభావం చూపుతుందని, ఇప్పటివరకు గిగ్ వర్కర్లకు ప్రయోజనాలు అందించే స్పష్టమైన సంక్షేమ పథకాలు కూడా రూపొందించలేదని పేర్కొన్నారు.
అయితే విచారణలో కోర్టు చేసిన మౌఖిక వ్యాఖ్యలు గిగ్ వర్కర్లలో కొత్త ఆశలు రేకెత్తించాయి. కేంద్ర చట్టం ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం మరింత మెరుగైన సంక్షేమ ప్రయోజనాలు అందించేలా అదనపు చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనే అంశాన్ని పరిశీలిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంటే కేంద్ర చట్టానికి విరుద్ధంగా కాకుండా, దానిని మరింత బలోపేతం చేసే విధంగా రాష్ట్ర చట్టం పనిచేయగలదా అనే కోణంలో విచారణ కొనసాగనుంది.
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వెల్ఫేర్ ఫీజు పూర్తిగా గిగ్ వర్కర్ల సంక్షేమానికేనని కోర్టుకు వివరించింది. ద్విచక్ర వాహనాల ప్రతి రైడ్‌కు గరిష్ఠంగా 50 పైసలు, త్రిచక్ర వాహనాలకు 75 పైసలు, నాలుగు చక్రాల వాహనాలకు రూ.1, అలాగే ఫుడ్, గ్రోసరీ డెలివరీలపై ఒక శాతం వరకు మాత్రమే వసూలు చేస్తామని తెలిపింది. ఈ నిధులతో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, హెల్త్ కేర్, ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ సపోర్ట్, సామాజిక భద్రత వంటి ప్రయోజనాలు భవిష్యత్తులో మరింత బలపడే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తానికి హైకోర్టు తీర్పు గిగ్ వర్కర్ల సంక్షేమానికి పెద్ద ఊరటనిచ్చే దిశగా తొలి అడుగుగా కనిపిస్తోంది. చట్టం చెల్లుబాటుపై తుది నిర్ణయం ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ, వెల్ఫేర్ ఫీజు సురక్షితంగా కోర్టు ఆధీనంలో ఉండేలా ఆదేశించడం, కంపెనీలకు తాత్కాలిక రక్షణ కల్పించడం, అదే సమయంలో గిగ్ వర్కర్ల భవిష్యత్ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విచారణ కొనసాగించడం ఈ కేసును దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చింది. ఇప్పుడు ఆగస్టు 14న జరిగే తదుపరి విచారణపై గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫారమ్ కంపెనీలు, కార్మిక సంఘాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
