టోల్ బూత్‌‌ను ఢీకొన్న ఎల్పీజీ ట్యాంకర్ ఐదుగురు సజీవదహనం..యూపీ కౌశాంబి టోల్ ప్లాజా వద్ద ఘటన

టోల్ బూత్‌‌ను ఢీకొన్న ఎల్పీజీ ట్యాంకర్ ఐదుగురు సజీవదహనం..యూపీ కౌశాంబి టోల్ ప్లాజా వద్ద ఘటన

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్‌‌పీజీ లోడ్​తో వెళ్తున్న ట్యాంకర్​ టోల్ బూత్‌‌ వద్ద డివైడర్​ను ఢీకొట్టింది. ఎల్‌‌పీజీ గ్యాస్​ లీకై మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ట్యాంకర్​ డ్రైవర్​ సహా ఐదుగురు సజీవదహనమయ్యారు. పలువురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌‌లోని కౌశాంబి టోల్​ప్లాజా వద్ద జూన్ 26న ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌‌ ద్వారా శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చాయి.

 24 సెకన్ల వీడియోలో.. 2 ట్యాంకర్లు టోల్ బూత్ వైపు వస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. వాటిలో కాన్పూర్ నుంచి ప్రతాప్‌‌గఢ్‌‌కు వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి డివైడర్‌‌ను ఢీకొడుతుంది. వెంటనే గ్యాస్ లీక్ అవ్వడంతో భారీ పేలుడు సంభవించింది. ఆ మంటలు సుమారు రెండు కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపించాయని సమాచారం. మంటలను అదుపులోకి తీసుకురావడానికి జిల్లాలోని అన్ని అగ్నిమాపక దళాల యూనిట్లతో పాటు సివిల్ పోలీసు సిబ్బందిని కూడా రంగంలోకి దించినట్టు ఒక పోలీసు అధికారి తెలిపారు. 

ట్యాంకర్ ​డ్రైవర్‌‌ ధర్మేంద్ర దుబే(40), టోల్ ప్లాజా ఉద్యోగి అలోక్ సింగ్ అక్కడికక్కడే మరణించారు. టోల్ ప్లాజాకు చెందిన పలువురు ఉద్యోగులు గాయపడటంతో  ఆస్పత్రికి తరలించారు. వారిలో ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన అనిల్ కుమార్ ఈ నెల 1న ట్రీట్​మెంట్ పొందుతూ మరణించాడు. రాయ్‌‌బరేలీకి చెందిన హిరమణి సింగ్, మధ్యప్రదేశ్‌‌కు చెందిన కృష్ణ పాల్ మౌర్య 2వ తేదీన మరణించారు. టోల్ ప్లాజా సమీపంలో నిలిపి ఉంచిన పదహారు మోటార్‌‌సైకిళ్లు, రెండు కార్లు కూడా మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయాయి.