ఒయార్జబల్ డబుల్ ధమాకా

ఒయార్జబల్ డబుల్ ధమాకా

ఇంగిల్‌‌‌‌వుడ్‌‌‌‌: మాజీ చాంపియన్‌‌‌‌ స్పెయిన్ కూడా ప్రిక్వార్టర్స్‌‌‌‌కు అర్హత సాధించింది. రౌండ్‌‌‌‌–32 మ్యాచ్‌‌‌‌లో 3–0తో ఆస్ట్రియాను చిత్తు చేసింది. 2010లో ప్రపంచకప్ గెలిచిన తర్వాత నాకౌట్ మ్యాచ్‌‌‌‌ల్లో స్పెయిన్‌‌‌‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. మ్యాచ్‌‌‌‌ ప్రారంభం నుండి స్పెయిన్ ఆటగాళ్లు బంతిని తమ ఆధీనంలో ఉంచుకుంటూ ప్రత్యర్థి రక్షణ శ్రేణిని ఒత్తిడిలోకి నెట్టారు. ఆట 36వ నిమిషంలో మార్క్ కుకురెల్లా అందించిన పాస్‌‌‌‌ను రియల్ సొసైడాడ్ కెప్టెన్ ఒయార్జబల్ గోల్‌‌‌‌గా మలిచి స్పెయిన్‌‌‌‌కు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం సెకండాఫ్‌‌‌‌లో 89వ నిమిషంలో ఒయార్జబల్ మరో గోల్ కొట్టి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. 

ఈ రెండు గోల్స్‌‌‌‌కు కుకురెల్లా అసిస్ట్‌‌‌‌లు అందించడం విశేషం. తర్వాత అలెక్స్ బేనా అందించిన క్రాస్‌‌‌‌ను పెడ్రో పోరో (66వ ని) హెడ్డర్ ద్వారా గోల్‌‌‌‌గా మలిచాడు.పోరోకు అంతర్జాతీయ కెరీర్‌‌‌‌లో ఇదే తొలి గోల్. ఈ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో స్పెయిన్ రక్షణ శ్రేణి ఇప్పటివరకు ఒక్క గోల్ కూడా సమర్పించుకోలేదు. ఆస్ట్రియా ఆటగాళ్లు కనీసం ఒక్క షాట్ కూడా గోల్ పోస్ట్‌‌‌‌పైకి కొట్టలేకపోయారు. 

స్పెయిన్ గోల్‌‌‌‌కీపర్ ఉనై సీమన్ వరుసగా నాలుగో మ్యాచ్‌‌‌‌లోనూ క్లీన్‌‌‌‌షీట్ (ప్రత్యర్థికి గోల్ ఇవ్వకపోవడం) సాధించాడు. మార్చి 2023 నుండి స్పెయిన్ జట్టు (లా రోజా) వరుసగా 35 అధికారిక మ్యాచ్‌‌‌‌ల్లో ఓటమి ఎరుగకుండా దూసుకెళ్తోంది. ఈ కాలంలోనే ఆ జట్టు 2023 నేషన్స్ లీగ్, 2024 యూరోపియన్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లను కైవసం చేసుకుంది.