సాగర్ ఆయకట్టులో వరిసాగు కష్టమే..పాలేరులో నీళ్లున్నా తాగునీటి కోసమే అంటున్న ఆఫీసర్లు 

సాగర్ ఆయకట్టులో వరిసాగు కష్టమే..పాలేరులో నీళ్లున్నా తాగునీటి కోసమే అంటున్న ఆఫీసర్లు 
  •  ఖమ్మం జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టు
  •  రాజీవ్ లింక్ కెనాల్ ఉపయోగించుకునే ప్లాన్ లో ఆధికారులు
  •  గోదావరి నీళ్లొస్తే 1.25 లక్షల ఎకరాలకు లబ్ధి

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలోని సాగర్​ ఆయకట్టులో వానాకాలం వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. బోర్లు, బావుల కింద తప్ప, పూర్తిగా నాగార్జున సాగర్​ నుంచి వచ్చే నీటిపైనే ఆధారపడే రైతులకు మాత్రం ఈసారి వరి సాగుకి అవకాశం కనిపించడం లేదు. ఎల్ నినో  ప్రభావంతో వర్షాలు తగ్గడం, కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లోకి ఆశించిన మేర నీటి ప్రవాహం లేకపోవడంతో సాధారణం కంటే సాగు విస్తీర్ణం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.

ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం ఇటీవల నాగార్జున సాగర్​ నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అయిన పాలేరు, వైరా జలాశయాలు ప్రస్తుతం జలకళ సంతరించుకున్నాయి. అయితే ఈ నీరు కేవలం తాగునీటి కోసమేనని ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని వరికి బదులుగా ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నారు. మరోవైపు అవకాశం ఉన్న మండలాలకు గోదావరి నుంచి సీతారామ ద్వారా నీళ్లందించాలని రైతులు కోరుతున్నారు. 

సాగుకు సిద్ధమవుతున్న రైతులు..

ఖమ్మం జిల్లాలో సాధారణంగా వానాకాలం 3 లక్షల ఎకరాలకు పైగా రైతులు వరిసాగు చేస్తారు. ఇందులో రెండున్నర లక్షల ఎకరాలు పూర్తిగా సాగర్​ ఆయకట్టు కాగా, మిగిలినవి చెరువులు, బోర్లు, బావుల కింద సాగవుతుంది. ఈసారి సాగర్​ నీరు వచ్చే అవకాశం లేకపోవడంతో భూగర్భ జలాలపై కూడా ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు.

బోర్లు, బావులపై మాత్రమే ఆధారపడి మొత్తం భూమిని సాగు చేయవద్దని సూచిస్తున్నప్పటికీ, రైతులు మాత్రం వరి సాగుకు వెనుకాడడం లేదు. ప్రస్తుతానికి ఖమ్మం జిల్లాలో దాదాపు 8 వేల ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు వేశారు. కానీ, సాగర్​ నీటితో సంబంధం లేకుండా రెగ్యులర్​ తరహాలోనే నారు సిద్ధం చేసుకుంటున్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలపై అవగాహన లేకపోవడంతో చాలామంది యథావిధిగా సాగుకు సిద్ధమవుతున్నారు.  

రాజీవ్ లింక్​ కెనాల్ ఉపయోగించుకుంటే..!

ఖమ్మం జిల్లాలో సాగర్​ జలాలు రాని సమయంలో ఉపయోగపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్​ లింక్​ కెనాల్ ను ఏర్పాటు చేశారు. సీతారామ ప్రాజెక్టు మెయిన్​ కెనాల్ నుంచి గోదావరి నీటిని వైరా రిజర్వాయర్ కు మళ్లించేలా ఏర్పాటు చేశారు. దాదాపు రూ.100 కోట్లతో జూలూరుపాడు మండలం వినాబానగర్​ నుంచి ఏన్కూరు మండలం అక్కినాపురం తండా వరకు 8.6 కిలోమీటర్ల మేర కాల్వ నిర్మించారు.

అక్కడి నుంచి అప్పటికే ఉన్న ఎన్ఎస్పీ కాల్వ ద్వారా 12 కిలోమీటర్లు నీరు ప్రయాణించి యూటీ ద్వారా వైరా రిజర్వాయర్ కు చేరేలా ప్లాన్​ చేశారు. దాదాపు 10 నెలల్లోనే నిర్మించిన ఈ లింక్​ కెనాల్ ను గతేడాది ట్రయల్ రన్​ నిర్వహించిన తర్వాత ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈసారి సాగర్ నీరు అందుబాటులో లేకపోవడంతో వైరా కింద ఉన్న 1.25 లక్షల ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో రాజీవ్​ లింక్​ కెనాల్ ద్వారా గోదావరి జలాలను తరలించే ప్రతిపాదనను ఆఫీసర్లు పరిశీలిస్తున్నారు.

ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే లిఫ్ట్ మోటర్లను సిద్ధం చేస్తామని ఇరిగేషన్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఈనెల రెండో వారం నుంచి రైతులు నాట్లు వేసుకుంటారని, ఈలోగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే గోదావరి నీటిని అందిస్తామంటున్నారు. 

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

సాధారణం కంటే ఈసారి వర్షపాతం తక్కువగా ఉంది. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లో కూడా నీళ్లు లేనందువల్ల రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలి. తక్కువ కాలంలో పంట చేతికి వచ్చే పప్పు ధాన్యాలు సాగు చేయడం మేలు. ఇందుకు తగిన విధంగా జిల్లాలో ఇప్పటికే విత్తనాలు సిద్ధం చేశాం. యూరియా కొరత లేకుండా చూస్తున్నాం. ఎరువులు సిద్ధంగా ఉంచాం. - ధనసరి పుల్లయ్య, ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖాధికారి