- బీఆర్ఎస్ పై చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ కాలయాపన : బీజేపీ
- రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
నల్గొండ, వెలుగు : కాళేశ్వరం పేరుతో అవినీతికి ఆజ్యం పోసిన బీఆర్ఎస్ పై చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటే... కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఆర్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ పేరుతో కొత్త తరహా దోపిడీకి తెరలేపిందని ఆరోపించారు.
శుక్రవారం నల్గొండలో పర్యటించిన ఆయన చింత ముత్యాలు రాసిన 'నల్గొండ జిల్లా ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట యోధులు' పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏ ఒక్కటేనన్నారు. ఒకరి అవినీతి మరొకరు బయటపెడుతున్నట్లు నటిస్తూ కాలయాపన చేయడమే తప్ప, కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ మాత్రమే రాజీలేని పోరాటం చేస్తోందని, బీజేపీ పోరాటాలు చూసి సీఎం రేవంత్ రెడ్డికి వణుకు పుడుతోందన్నారు.
ఎమర్జెన్సీ కాలంలో నల్గొండ జిల్లాకు చెందిన అనేక మంది జైలుకు వెళ్లారని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి వారు చేసిన పోరాటం మరువలేనిదన్నారు. ఆనాడు పోలీసుల వేధింపులను తట్టుకొని నిలబడ్డ కార్యకర్తల అనుభవాలను పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు. ఎమర్జెన్సీ విధించినందుకు కాంగ్రెస్ ఇప్పటికీ క్షమాపణ చెప్పలేదని, వారికి పశ్చాత్తాపం కూడా లేదన్నారు. వీబీ-జి రాంజీ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు, రైతులకు, కూలీలకు మేలు జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.
నల్గొండ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తుందని, నల్గొండ పట్టణానికి తాగునీటి సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం 'అమృత్' పథకం కింద రూ. 83 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. పానగల్ నుంచి నల్గొండ వరకు రోడ్డు మరమ్మతుల కోసం రూ. 13 కోట్లు మంజూరై ఏడాది గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో ఎఫ్ సీఐ గోడౌన్లు, హైవేలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల రిపేర్లకు కేంద్రమే నిధులు ఇస్తోందని చెప్పారు.
