- రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు, కలెక్టర్
- 200 మీటర్ల పనుల పూర్తితో ప్రజలకు అందుబాటులోకి రానున్న 22 కి.మీ రోడ్డు
సిద్దిపేట/ గజ్వేల్, వెలుగు : గజ్వేల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఎన్నేళ్లుగానో ఎదురవుతున్న ఆటంకాలు క్రమంగా తొలగిపోతున్నాయి. దాదాపు దశాబ్ద కాలం కిందట ఈ పనులు ప్రారంభమైనప్పటికీ, పలు కారణాల వల్ల రింగ్ రోడ్డు సంపూర్ణంగా అందుబాటులోకి రాలేదు. ఇటీవల రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయినప్పటికీ.. సంగాపూర్ రోడ్డులో రాంచంద్రం అనే రైతు కోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయి.
రింగ్ రోడ్డు కారణంగా తన విలువైన భూమిని కోల్పోతున్నానని, దానికి బదులుగా ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలని సదరు రైతు 2019లో హైకోర్టులో కేసు వేశారు. దీనిపై ఇటీవలే నిర్వాసితుడికి అనుకూలంగా తీర్పు రావడంతో, నిలిచిపోయిన చోట పనులను తిరిగి ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నర్మెట పర్యటనకు వచ్చిన సందర్భంలో, ఎంపీ రఘునందన్ రావు ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిశీలించారు.
రంగలోకి అధికారులు.. కోర్టు తీర్పు నేపథ్యంలో రెవెన్యూ అధికారులు,
కలెక్టర్ రంగంలోకి దిగి భూ నిర్వాసితుడితో చర్చలు జరిపారు. నోటిఫికేషన్ సమయానికి సదరు రైతు కోల్పోతున్న భూమిని పరిశీలించి, తగిన న్యాయం చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. సంగాపూర్ రోడ్డులో కేవలం 200 మీటర్ల మేర పనులు నిలిచిపోవడంతో మొత్తం 22 కిలోమీటర్ల రింగ్ రోడ్డు పూర్తి స్థాయిలో అనుసంధానం కావడానికి అడ్డంకిగా మారింది. ఇప్పుడు ఆ నిర్వాసితుడి సమస్యను పరిష్కరించి, మిగిలిపోయిన ఆ కొద్దిపాటి ప్రాంతంలో ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే పనులను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 200 మీటర్ల రోడ్డు పూర్తయితే గజ్వేల్ రింగ్ రోడ్డు ప్రజలకు సంపూర్ణంగా వినియోగంలోకి రానుంది.
దశాబ్ద కాలం కింద ప్రారంభం
గజ్వేల్ పట్టణ భవిష్యత్ అవసరాల కోసం రాజీవ్ రహదారి నుంచి 22 కిలోమీటర్ల మేర, రూ. 220 కోట్లతో ఈ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. మొదట గజ్వేల్ చుట్టూ 19 కిలోమీటర్ల మేర 30 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మించాలని భావించి, 140 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఆ తర్వాత దీనిని ఫోర్ లేన్ రోడ్డుగా రీ-డిజైన్ చేయడంతో పాటు, వ్యయాన్ని రూ. 220 కోట్లకు పెంచి, 209 ఎకరాల భూసేకరణ జరపాలని నిర్ణయించారు. మొదటి విడతలో 15 కిలోమీటర్ల పనులు పూర్తయినప్పటికీ, మిగిలిన 7 కిలోమీటర్ల పరిధిలో భూసేకరణ పరిహారాలపై కొందరు యజమానులు కోర్టుకు వెళ్లడంతో జాప్యం జరిగింది. తాజాగా అధికారుల చొరవతో చర్చలు సఫలమై 90 శాతం పనులు పూర్తి కాగా, పెండింగ్‌లో ఉన్న రైల్వే బ్రిడ్జి పనులను కూడా పూర్తి చేశారు.
మూడు బ్రిడ్జిలు.. ఏడు సర్కిళ్లు..
ఈ 22 కిలోమీటర్ల గజ్వేల్ రింగ్ రోడ్డులో మొత్తం మూడు బ్రిడ్జిలు, ఏడు సర్కిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో రాజీవ్ రహదారిని ఆనుకుని వెళ్లే 7 కిలోమీటర్ల మార్గాన్ని 150 ఫీట్ల వెడల్పుతో ఆరు లైన్లుగా, మిగిలిన 15 కిలోమీటర్ల మార్గాన్ని 100 ఫీట్ల వెడల్పుతో నాలుగు లైన్లుగా నిర్మిస్తున్నారు. రాజీవ్ రహదారిపై పాతూరు రోడ్డు నుంచి జగదేవ్‌పూర్ రోడ్డు మీదుగా రిమ్మనగూడ వరకు మూడు బ్రిడ్జిల నిర్మాణం పూర్తయింది. ఈ రింగ్ రోడ్డులో పాతూరు, ముట్రాజుపల్లి, చేగుంట, దౌల్తాబాద్, రిమ్మనగూడతో పాటు మరో రెండు చోట్ల సర్కిళ్లను ఏర్పాటు చేశారు.
పరిహారం చెల్లింపు పై చర్చలు
రోడ్డు లో భూమిని కొల్పొతున్న రాంచంద్రంతో ఉన్నతాధికారులు మాట్లాడారు. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం ప్రకటించనున్నారు. ఇది పూర్తి కాగానే మిగులు పనులను ప్రారంభిస్తారు.
-స్వామి, తహసీల్దారు, గజ్వేల్
