ఉరి శిక్ష ప్రత్యామ్నాయంపై సుప్రీం కోర్టులో ఆసక్తికర వాదనలు..

ఉరి శిక్ష ప్రత్యామ్నాయంపై సుప్రీం కోర్టులో ఆసక్తికర వాదనలు..

ఉరి శిక్ష అనేది చాలా క్రూరమైనదని.. అత్యంత ఘోరమైనది అని.. ఉరి శిక్ష అమలు విషయంలో ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని.. ఉరి శిక్ష అమలు విధానాన్ని మార్చాలంటూ దాఖలైన పిటీషన్ పై సుప్రీంకోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి. ఉరి శిక్షకు బదులుగా ప్రాణాంతకమైన ఇంజెక్షన్ వంటి తక్కువ బాధాకరమైన మరో మార్గాల ద్వారా అమర శిక్షను అమలు చేయాలన్న పిటీషన్ పై విచారణ చేసింది సుప్రీం కోర్టు. ఈ పిటీషన్ పై విచారణ సందర్భంగా గతంలో జరిగిన వాదనలు, ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ సమాధానం ఆసక్తికరంగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మరణశిక్ష విధించినప్పుడు ఉరితీయడానికి బదులుగా, తక్కువ బాధ కలిగించే వేరే మార్గాలను (ఉదాహరణకు ప్రాణాంతక ఇంజెక్షన్) ఉపయోగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. ఉరిశిక్షకు సంబంధించిన పాత తీర్పులను లేదా చట్టాలను మళ్లీ పరిశీలించడానికి పెద్ద ధర్మాసనానికి పంపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

భవిష్యత్తులో మార్పుకు అవకాశం  
ఇది ముగిసిపోయిన అంశం కాదని కోర్టు పేర్కొంది. మరణశిక్ష అమలుకు ఉరి కంటే తక్కువ బాధాకరమైన, మెరుగైన ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయని నిరూపించే బలమైన శాస్త్రీయ ఆధారాలు లభిస్తే.. భవిష్యత్తులో ఈ అంశాన్ని మళ్లీ పరిశీలిస్తామని తెలిపింది.

పిటిషన్ లో ఏముంది?
న్యాయవాది రిషి మల్హోత్రా 2017లో ఈ పిటిషన్ వేశారు. ఉరితీయడం అనేది చాలా క్రూరమైన, బాధాకరమైన పద్ధతి అని ఆయన పేర్కొన్నారు. ఉరితీసిన తర్వాత మనిషి చనిపోయాడని నిర్ధారించడానికి దాదాపు 40 నిమిషాలు పడుతుంది. అదే ప్రాణాంతక ఇంజెక్షన్, కాల్చివేత (షూటింగ్), లేదా ఎలక్ట్రిక్ ఛైర్ లాంటి మార్గాలైతే కేవలం 5 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తవుతుందని, దోషికి బాధ తక్కువగా ఉంటుందని సూచించారు.

ALSO READ : ప్రధాని మోదీ దృష్టిలో భగత్ సింగ్, అంబేద్కర్ దిమాగీ నక్సల్స్ నా?

కేంద్ర ప్రభుత్వం స్పందన:
మరణశిక్ష అమలు పద్ధతిపై అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే, ప్రస్తుతమున్న ఉరిశిక్ష విధానాన్ని మార్చడానికి ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపకపోవడంపై గతంలో సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలంతో పాటు పద్ధతులు మారాలని కోర్టు వ్యాఖ్యానించింది.