బాల్కొండ, వెలుగు: నిజామాబాద్ జిల్లా భీంగల్ లో వర్షాకాలం దృష్ట్యా హోటళ్లు, స్వీట్ హోమ్‌లు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, తినుబండారాల దుకాణాలకు మున్సిపల్ ఆఫీసర్లు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. కలెక్టర్, మున్సిపల్ చైర్‌పర్సన్ ఆదేశాల మేరకు నష్ట నివారణ చర్యలు చేపట్టామని.. దుకాణ ఓనర్లు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం, తాగునీరు మాత్రమే వినియోగదారులకు అందించాలని కమిషనర్ గజానంద్ సూచించారు.
ఆహార పదార్థాలపై ఈగలు, క్రిమికీటకాలు వాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. దుకాణాలు, చికెన్, మటన్ సెంటర్ల నుంచి వెలువడే చెత్తను చెరువులు, ప్రధాన రహదారుల వద్ద వేయకుండా మున్సిపల్ వాహనాలకే అందించాలన్నారు. నిబంధనలు పాటించని వారిపై జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
