- ఎత్తు, బరువుతో పాటు ఇకపై డెవలప్ మెంటల్ మైల్ స్టోన్స్ గుర్తింపు
- న్యూట్రిషన్ ట్రాకింగ్ తో చిన్నారుల్లో పోషకాహార లోపానికి చెక్
- 0 నుంచి ఐదేండ్ల వయసున్న ప్రతి చిన్నారి హెల్త్ పై మానిటరింగ్
- రాష్ట్రవ్యాప్తంగా 35 వేల అంగన్వాడీ సెంటర్లలో 18 లక్షల మంది పిల్లలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లలో చదువుకుంటున్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ చిన్నారుల సమగ్ర ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా 'గ్రోత్ మానిటరింగ్' కార్డులను రూపొందిస్తున్నది. గతంలో కేవలం ఎత్తు, బరువుకే పరిమితమైన ఈ ప్రక్రియను.. ఇప్పుడు మరింత లోతుగా, శాస్త్రీయంగా నిర్వహించాలని నిర్ణయించింది. కేవలం పోషకాహారం అందించడమే కాకుండా, ఆ ఆహారం పిల్లల శారీరక, మానసిక వికాసానికి ఏ మేరకు తోడ్పడుతుందో ఈ కార్డుల ద్వారా అంచనా వేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35,781 అంగన్వాడీ సెంటర్లలోని సుమారు 18 లక్షల మంది చిన్నారులకు ఈ కార్డులను త్వరలోనే అందించేందుకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తున్నది.
కార్డుల్లో డెవలప్‌మెంటల్ మైల్ స్టోన్స్..
ప్రస్తుతం ఉన్న గ్రోత్ మానిటరింగ్ విధానంలో కేవలం పిల్లల వయసుకి తగ్గ బరువు, ఎత్తును మాత్రమే లెక్కిస్తున్నారు. అయితే, కొత్తగా ప్రవేశపెట్టబోయే కార్డుల్లో 'డెవలప్‌మెంటల్ మైల్‌స్టోన్స్' అంశాన్ని అదనంగా చేర్చారు. అంటే.. ఒక పాప లేదా బాబు తన వయసుకి తగ్గట్టుగా పాకడం, నడవడం, మాట్లాడటం, వస్తువులను గుర్తించడం వంటి పనులను సక్రమంగా చేస్తున్నారా? లేదా అన్నది ఈ కార్డులో పొందుపరుస్తారు. సున్నా నుంచి ఐదేండ్ల లోపు పిల్లల్లో మెదడు అభివృద్ధి అత్యంత వేగంగా జరుగుతుంది. ఈ సమయంలో వారిలో తలెత్తే చిన్నపాటి లోపాలను కూడా ప్రారంభ దశలోనే గుర్తించి, తగిన వైద్యం, థెరపీ అందించడం ఈ గ్రోత్ మానిటరింగ్ కార్డుల ప్రధాన ఉద్దేశమని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు.
పోషణతో పాటు అవగాహన..
పిల్లల ఎదుగుదలలో కేవలం అంగన్వాడీ టీచర్ల పాత్రే కాకుండా, తల్లిదండ్రులు, సంరక్షకుల భాగస్వామ్యం కూడా ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు కొత్త కార్డుల్లో ‘కేర్ గివర్ అవేర్ నెస్’ విభాగానికి ప్రాధాన్యతనిచ్చారు. ఇంట్లో పిల్లలకి ఎలాంటి ఆహారం అందించాలి, వారు అనారోగ్యానికి గురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత వంటి అంశాలపై తల్లిదండ్రులకు ఈ కార్డుల ద్వారా అవగాహన కల్పిస్తారు. అలాగే, చిన్నారులకు ప్రతి నెలా అందుతున్న పౌష్టికాహారం, వారి రక్తహీనత స్థితిగతులు, వ్యాక్సినేషన్ వివరాలను కూడా ఇందులో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తారు. ఇది ఒక రకంగా చిన్నారుల
హెల్త్ రిపోర్ట్ కార్డ్ లా పనిచేయనుంది.
చిన్నారుల హెల్త్ పై నిఘా..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18 లక్షల మంది చిన్నారుల డేటాను ఈ కార్డుల ద్వారా క్రోడీకరించడం వల్ల భవిష్యత్తులో ఆరోగ్య ప్రణాళికల రూపకల్పన సులభతరం కానుంది. ఏ ప్రాంతంలో పిల్లలు తక్కువ బరువుతో ఉన్నారు? ఎక్కడ పోషకాహార లోపం ఎక్కువగా ఉంది? తదితర విషయాలను ఈ కార్డుల డేటా ఆధారంగా సులభంగా విశ్లేషించవచ్చు. 35,781 అంగన్వాడీ సెంటర్లలోని సిబ్బందికి ఈ కార్డుల నిర్వహణపై త్వరలోనే ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కొత్త మానిటరింగ్ విధానం అమల్లోకి వస్తే, రాష్ట్రంలో శిశు మరణాల రేటు తగ్గడంతో పాటు, ఆరోగ్యవంతమైన తరం తయారవుతుందని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
