బోధనలో క్వాలిటీ కోసం టీచర్లకు ట్రైనింగ్

బోధనలో క్వాలిటీ కోసం టీచర్లకు ట్రైనింగ్
  •     ఆగస్టు 15లోగా మూడు విడతలుగా శిక్షణ 
  •     ఇందుకు రూ.17.69 కోట్లు మంజూరు

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. టీచింగ్ క్వాలిటీ కోసం ‘ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ క్వాలిటీ లెర్నింగ్ త్రూ ట్రాన్స్‌‌ఫార్మేటివ్ క్లాస్‌‌ రూమ్ ప్రాక్టీసెస్’ పేరుతో టీచర్లకు మూడు రోజులు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. జులై 2న మొదలైన ఈ ప్రక్రియ ఆగస్టు 15లోపు పూర్తికానున్నది. దీంతో రాష్ట్రంలోని 1,17,414 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలను రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో మూడు విడతలుగా నిర్వహించనున్నారు. 

తొలుత రాష్ట్ర స్థాయిలో రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇస్తారు. వీరు జిల్లాల్లో, ఆ తర్వాత మండల కేంద్రాల్లో టీచర్లకు శిక్షణ ఇస్తారు. వివిధ సబ్జెక్టులకు సంబంధించి గురువారం రాష్ట్ర స్థాయి శిక్షణ ప్రారంభం కాగా,  ఆగస్టు 15లోపు మండల స్థాయి వరకు శిక్షణ పూర్తి కానున్నది. ఎస్‌‌జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, హెడ్ మాస్టర్లు, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, గురుకుల టీచర్లందరికీ ఈ శిక్షణ ఇవ్వనున్నారు.  స్కూళ్లలో చదువుకు ఆటంకం కలగకుండా రెండు స్పెల్స్‌‌లో శిక్షణ నిర్వహించనున్నారు. ఈ శిక్షణ కోసం ప్రభుత్వం రూ.17.69 కోట్ల నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం జరుగుతున్న స్టేట్ రీసోర్స్ పర్సన్ల ట్రైనింగ్ ను సీనియర్ టీచర్లతో కాకుండా ప్రొఫెసర్లు, బీఈడీ, డీఈడీ టీచర్లతో ఇప్పిస్తే బాగుండనే అభిప్రాయం టీచర్ల నుంచి వ్యక్తం అవుతోంది. దీంతో పాటు ఎస్​సీఈఆర్టీ రూపొందించిన వివిధ సబ్జెక్టుల హాండ్ బుక్​లో రైజింగ్ తెలంగాణ లోగో లేకపోవడంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.