ఆర్థిక కేంద్రాలుగా 500 నగరాలు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల

ఆర్థిక కేంద్రాలుగా 500 నగరాలు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల

న్యూఢిల్లీ: ఇండియాలో దాదాపు 500 నగరాలు కొత్త ఆర్థిక కేంద్రాలుగా ఎదగడానికి సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఫ్రాన్స్​లో జరిగిన ఒక ఆర్థిక సదస్సులో ఆమె మాట్లాడుతూ ఈ నగరాల ఎదుగుదలకు మధ్యతరగతే ప్రధాన ఇంజన్ అని స్పష్టం చేశారు.  ఇండియా జనాభాలో 31 శాతం మంది మధ్యతరగతి వారే ఉన్నారని, ఆర్థిక సంస్కరణల తర్వాత ఈ జనాభా ఏటా 6.3 శాతం వృద్ధి చెందుతోందని వివరించారు. 

‘దేశంలో జరిగే మొత్తం వ్యయంలో 93 శాతం మధ్యతరగతి లేదా కొద్దిపాటి సంపన్నుల వల్లే జరుగుతోంది. ఈ మధ్యతరగతి కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా టైర్ 2 , టైర్ 3 నగరాల్లోనూ విస్తరించి ఉంది. ప్రభుత్వ చర్యల వల్ల 2030–2035 మధ్యకాలంలో మధ్యతరగతి జనాభా పరిమాణంలో భారత్ చైనాను అధిగమిస్తుందని ఓఈసీడీ అధ్యయనం వెల్లడించింది. ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే భయాలు ఉన్నవారి కోసం ప్రభుత్వం నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది”అని ఆమె  వివరించారు.