ఉస్మానియా డాక్టర్లకు సన్మానం

ఉస్మానియా డాక్టర్లకు సన్మానం
  •     ఒకే వ్యక్తికి ఒకేసారి ఐదు అవయవాల మార్పిడి సర్జరీ సక్సెస్ చేసిన వైద్యులు
  •     సెక్రటేరియెట్‌‌లో ఘనంగా సన్మానించిన మంత్రి దామోదర
  •     రాష్ట్ర ప్రభుత్వ వైద్యరంగ నైపుణ్యాన్ని యావత్ దేశానికి చాటిచెప్పారని ప్రశంస

హైదరాబాద్, వెలుగు:  ఒకే రోగికి ఒకేసారి ఐదు అవయవాల మార్పిడి (మల్టీ-విసెరల్) సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డాక్టర్ల టీమ్‌‌ను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఘనంగా సన్మానించారు. శుక్రవారం సెక్రటేరియెట్‌‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రాన్స్‌‌ప్లాంట్ చేసిన టీమ్‌‌కు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ డిపార్ట్‌‌మెంట్ హెడ్ డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలో డాక్టర్ సుదర్శన్ రెడ్డి, పీజీలు గోపి, దీపక్, యశ్వంత్, అదితి, ఓసెన్‌‌లతో కూడిన సర్జన్ల టీమ్, అనస్థీషియా డిపార్ట్‌‌మెంట్ హెచ్‌‌ఓడీ డాక్టర్ పాండు నాయక్ బృందంలోని డాక్టర్లు యాసీన్ ఫాతిమా, భావన, శివ సెల్విలతో పాటు నర్సింగ్ సిబ్బంది సరళ, రాణి, ఆదర్శ, రమాదేవి, టెక్నీషియన్ కృష్ణలు 36 గంటల పాటు నిరంతరాయంగా శ్రమించి ఈ అరుదైన విజయాన్ని సాధించారని మంత్రి కొనియాడారు. ఈ విజయం రాష్ట్ర వైద్య రంగం నైపుణ్యాన్ని యావత్ దేశానికి చాటిచెప్పిందని హర్షం వ్యక్తం చేశారు.

కార్పొరేట్ హాస్పిటల్స్‌‌కు ధీటుగా సర్కారు వైద్యం

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ హాస్పిటల్స్‌‌ను కార్పొరేట్ స్థాయికి దీటుగా తీర్చిదిద్దుతోందని మంత్రి దామోదర స్పష్టం చేశారు.  గత రెండున్నర ఏళ్లలో ఆరోగ్య శాఖలో 15 వేల పోస్టులను భర్తీ చేశామని, తాజాగా మరో 6,238 పోస్టులను మంజూరు చేసినట్లు వెల్లడించారు.  అవయవదానం చేసిన దాత కుటుంబ సభ్యులను అభినందిస్తూ, సమాజంలో 'అవయవదానం-మహాదానం' అనే చైతన్యం రావాలని పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తెస్తున్న డాక్టర్లను, వైద్య సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.