మెదక్టౌన్, వెలుగు : భూరీసర్వే ప్రక్రియను గడువులోగా పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి భూపరిపాలన ప్రధాన కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్ సూచించారు. మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, భూభారతి ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కలెక్టర్ ప్రతిమాసింగ్ తో కలిసి జిల్లాలో భూసర్వే అమలు తీరు, భూభారతి, సాదా బైనామా, రెవెన్యూ సదస్సుల నిర్వహణ తదితర అంశాలపై ఆయన చర్చించారు.
జిల్లాలో ఎంపిక చేసిన 24 గ్రామాలకు గాను 7 గ్రామాల్లో రీసర్వే ముగిసి, 18 గ్రామసభలు నిర్వహించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిజమైన భూలబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. లైసెన్స్ సర్వేయర్లకు ప్రతీ వారం గౌరవ వేతనం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. సాదాబైనామా, భూభారతి పెండింగ్ దరఖాస్తులను కట్ ఆఫ్ డేట్ పెట్టుకుని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ డిజిటల్ సర్వేను కచ్చితత్వంతో పూర్తి చేయడానికి జిల్లా యంత్రాంగం పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తోందని తెలిపారు.
