జీడిమెట్ల, వెలుగు: భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సంక్రాంతిపాడు గ్రామానికి చెందిన ఆరె భార్గవికి 2014లో కిలారు బాలకృష్ణతో వివాహమైంది. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు.
ఈక్రమంలో బాలకృష్ణ మద్యానికి బానిసై, భార్యను శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. అందరి ముందు బూతులు తిట్టేవాడు. పలుమార్లు గొడవలు జరగగా పెద్దలు ఆమెకు నచ్చజెప్పారు. గత నెల 21న బాచుపల్లి పరిధిలోని రాజీవ్‌గాంధీనగర్‌లోని ఇంట్లో భార్గవిని బాలకృష్ణ హత్య చేశాడు. ఆ తరువాత ఎవరికీ అనుమానం రాకుండా డైనింగ్ టేబుల్‌పై ఎక్కి ఉరేసుకున్నట్లు చిత్రీకరించాడు. మృతురాలి సోదరుడు బాలకృష్ణపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
