- యేటా రూ.10 కోట్లకిపైగా ఖర్చు చేస్తున్నా ఫలితం లేదు
- కాంట్రాక్టర్లు,అధికారుల కుమ్మక్కు
- కార్వాన్ సర్కిల్ మూసీ డీసిల్టింగ్ టెండర్లలో అవకతవకలు
- టెండర్లు రద్దు చేస్తూ నిర్ణయం
హైదరాబాద్ సిటీ, వెలుగు: మూసీ ప్రక్షాళన పేరుతో ప్రతి ఏడాది రూ. కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. బురద తొలగింపు, ప్రవాహానికి అడ్డంకులు తొలగించడం, గుర్రపు డెక్క, ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త తొలగింపు వంటి పనుల కోసం బల్దియా ఏటా రూ.10 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నా అధికారుల కక్కుర్తి, పనులు చేసే కాంట్రాక్టర్ల దోపిడీ వల్ల ప్రయోజనం లేకుండా పోతున్నది. పాత జీహెచ్ఎంసీ లిమిట్స్‌లో 33 కిలోమీటర్ల పొడవున మూసీ విస్తరించి ఉంది. ప్రతి వానాకాలానికి ముందు డీసిల్టింగ్, క్లీనింగ్ పనులు చేస్తున్నామని చెప్తున్నా అందులో బురద, చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయే కనిపిస్తున్నాయి. పనులు చేయకుండానే నిధులు కాజేస్తుండడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
మూసీ టెండర్లలో గోల్ మాల్
గోల్కొండ జోన్ లోని కార్వాన్ సర్కిల్‌లో మూసీ డీసిల్టింగ్ టెండర్ల కేటాయింపులో అవకతవకలే దీనికి ఉదాహరణగా నిలుస్తున్నది. పురాణాపూల్ బ్రిడ్జి నుంచి అత్తాపూర్ బ్రిడ్జి వరకు డీసిల్టింగ్ పనుల కోసం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లాల్ సింగ్ టెండర్లు పిలిచారు. 4 నెలలకు ఒకటి చొప్పున మూడు టెండర్లు..ఒక్కో టెండర్రూ.38 లక్షల చొప్పున వేశారు. అయితే, సదరు ఆఫీసర్తెలివిగా వ్యవహరించారు.
రూ.50లక్షలు దాటితే జోన్ స్థాయిలో టెండర్లు వేయాల్సి వస్తుందని..రూ.38లక్షలతో నాలుగు టెండర్లు పిలిచారు. ఇందులో 26 శాతం తక్కువ (లెస్) కోట్ చేసిన బిడ్డర్‌ను పక్కనపెట్టి, కేవలం 2 శాతం తక్కువ కోట్ చేసిన సంస్థకు టెండర్ కేటాయించారు. టెండర్ ప్రక్రియ మధ్యలో కొత్త రూల్స్తీసుకువచ్చి తనకు అనుకూలమైన సంస్థకు పనులు అప్పగించారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లింది.
విచారణలో నిజమేనని తేలడంతో టెండర్ రద్దు చేశారు. ఇది ఒక్కచోటనే బయటపడ్డ మూసీ క్లీనింగ్ పనుల టెండర్లలో పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏటా కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పటికీ, పనుల నాణ్యత, పర్యవేక్షణ, టెండర్ ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
10 సర్కిళ్లకు రూ.10 కోట్లు
కార్వాన్ సర్కిల్‌లో 3 కిలోమీటర్ల మూసీ క్లీనింగ్ కోసం రూ.కోటి 14 లక్షలతో టెండర్లు వేశారు. ఈ లెక్కన పాత జీహెచ్ఎంసీ పరిధిలోని మలక్‌పేట్, సంతోష్‌నగర్, చార్మినార్, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్, మెహిదీపట్నం, కార్వాన్ , గోషామహల్, అంబర్‌పేట్, ఉప్పల్ సర్కిల్స్ పరిధిలో మూసీ ప్రవహిస్తుంది.
మొత్తంగా బడ్జెట్రూ.10 కోట్లు కాగా, ఎక్కడెక్కడ ఎలా పనులు జరుగుతున్నాయో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు దృష్టి పెట్టకపోవడం, ఆడిట్ ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. మూసీ క్లీనింగ్ పై ఎప్పటి నుంచి బిల్లులు జారీ అయ్యాయి? పనులు ఎంతమేర చేశారన్నదానిపై సమగ్రంగా విచారణ జరిపిస్తే అక్రమాలు బయటపడే అవకాశాలున్నాయి.
